పొలిటికల్ ఎంట్రీ కి మోహన్ బాబు రెడీ .. ఏ పార్టీయో తెలుసా ..?       2018-06-02   23:26:40  IST  Bhanu C

మోహన్ బాబు ! ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలుగొట్టినట్టు చెప్పడం .. ముక్కుసూటిగా మాట్లాడ్డం ఆయన నైజం. ఆయన చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. చాలాకాలంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో మోహన్ బాబు టీడీపీలో కీలక బాధ్యతలు చూసేవాడు. ఎన్టీఆర్ వెన్నంటే ఉండేవాడు మోహన్ బాబు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా నామినేట్ అయ్యాడు. ఆ తరువాత టీడీపీ బాబు చేతిలోకి వెళ్ళాక సైలెంట్ అయిపోయాడు.

తాజాగా ఈయన ప్రత్యక్ష పోటీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈయన వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. అందుకు త్వరలోనే ముహూర్తమని అంటున్నారు. అలాగే వైసీపీ తరపున చిత్తూరు లేదా నెల్లూరు జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి మోహన్ బాబు పోటీ చేయడం ఖాయం అని తెలుస్తోంది.

ప్రజలు మంచి వాళ్ళు అలాంటి వాళ్ళకి మంచే చెయ్యాలి. నేను మంచి చేసే పార్టీ ప్రస్తుతం ఏదైతే ఉందొ ఆ పార్టీ లోనే అడుగు పెడతాను అని తెలిపారు మోహన్ బాబు. అంటే ఇక్కడ అర్ధం ఏమిటంటే ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికీ హామీలు ఇస్తూ తన యాత్రని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు అంటే జగన్ ప్రజలకి మంచే చేస్తున్నారు అని చెప్పకనే చెప్పాడు మోహన్ బాబు. 2019 లో మోహన్ బాబు శ్రీకాళహస్తి లేదా వెంకటగిరి నుంచి వైసీపీ తరుపున పోటి చేయ్యనున్నారని వార్తలు కూడా మీడియాలో పెద్ద ఎత్తునే వస్తున్నాయి.

ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు జగన్ ను అభినందించాడు. జగన్ పాదయాత్ర చారిత్రాత్మకం అని విష్ణు వ్యాఖ్యానించాడు. ఇక వైఎస్ కుటుంబంతో వియ్యం అందుకున్న మోహన్ బాబు అటువైపు కూడా దగ్గరయ్యాడు. ఇక వైఎస్ మరణం, జగన్ అరెస్టుల సమయంలో మోహన్ బాబు వారికి సన్నిహితంగా మెలిగాడు. జగన్ ను జైలుకు వెళ్లి మరీ పరామర్శించాడు మోహన్ బాబు.