పెళ్లి అయ్యాక ఆడపిల్ల జీవితంలో పుట్టింటి బంధం ప్రాముఖ్యత ఏమిటి?  

వివాహం అయ్యాక ఆడపిల్లకు పుట్టింటితో అనుబంధం ఉండేలా మన పెద్దవారు ఎన్నో సంప్రదాయాలను పెట్టారు. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాక ఆడపిల్ల బాగోగులు చూడాలని,పెళ్లి అయినా తర్వాత కూడా అన్నా చెల్లెళ్ళ బంధంలో మరింత అనురాగం ఉండాలనే ఉద్దేశంతో ఆడపిల్ల ఇంటిలో జరిగే ప్రతి వేడుకలోను మేనమామ ప్రధాన పాత్ర పోషించేలా సంప్రదాయాలను మన పెద్దవారు పెట్టారు.మేనకోడలి చెవులు కుట్టించటం దగ్గర నుండి వివాహ సమయంలో పెళ్లి కూతురిగా బుట్టలో వేదికపైకి తీసుకు వచ్చేంత వరకూ మేనమామగా తన వంతు పాత్రను పోషించేలా చేశారు..

-

అలాగే ఆడపిల్ల కూడా పుట్టింటి వారిని మర్చిపోకుండా ఉండటానికి పుట్టింటిలో జరిగే ప్రతి వేడుక ఆడపిల్ల చేతుల మీదుగా జరగాలనే ఆచారాన్ని మన పెద్దవారు పెట్టారు.అలాగే ఆడపిల్ల సోదరుని వివాహానికి అందరి కన్నా ముందుగా వచ్చి అన్ని పనులను భుజాన వేసుకొని మరీ చక్కపెడుతుంది. ఆడపిల్లగా తనకి పుట్టినింటి పై ఎప్పటికీ హక్కు వుంటుందన్నట్టుగా, తనకి రావలసిన అన్ని లాంఛనాలను అధికారికంగా తీసుకుంటుంది.

ఒకవేళ పుట్టింటి వారి పరిస్థితి బాగోలేకపోతే, వారికి అన్నివిధాలుగా ఆసరాగా నిలబడటానికి కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోను వెనుకడుగు వేయదు.