పింక్ డైమండ్ పింక్ డైమండ్ ఎక్కడకి వెళ్ళావ్ ..?       2018-06-04   01:56:05  IST  Raghu V

తిరుమల తిరుపతి దేవస్థానం లో జరుగుతున్న అక్రమాలపై రాజుకున్న అగ్ని ఇంకా చల్లారలేదు. రమణదీక్షితులు ఆరోపణలకు ఎవరు సరైన సమాధానం చెప్పకుండా ఆయనపై విమర్శల బాణాలు వదిలారు. కానీ కోర్టు పక్షిగా పేరున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఈ వివాదంలోకి వచ్చి రమణదీక్షితులకు మద్దతుగా ఉండడమే కాకుండా ఆయన చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు సేకరించి సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరగబోతోంది.

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు, రమణ దీక్షితులును అక్రమంగా తొలగించిన అంశాలపై ఆయన పిటిషను దాఖలు చేయనున్నారు. ముఖ్యంగా టీటీడీ లాంటి ధార్మిక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించేలా పిటిషను దాఖలు చేయనున్నారని సమాచారం.

సుబమ్రణ్యం స్వామి ఈకేసును సవాలుగా తీసుకుంటున్నట్లు తెలిసింది. స్వామి ఇది వరకు పలు కీలక అంశాల గురించి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని కేసులలోనూ ఆయునకు అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఆయన చేసిన ఆరోపణలు అన్నీ నిజాలుగా తేలాయి. అదే విధంగా టీటీడీపై ఆయన దాఖలు చేయనున్న కేసు కూడా పక్కాగా ఉంటుందనే అభిప్రాయ పడుతున్నారు. రమణ దీక్షితులు నుంచి సేకరించిన ఆధారాలన్నీ కేసు గెలిచేందుకు ఉపయోగకరంగా ఉన్నాయని తన సహచరులతో స్వామి అన్నట్లు తెలిసింది.

టీటీడీ వద్ద ఉన్న ఆభరణాలు, నగలు, నగదు అన్నీ బహిరంగపరచాలనే నిర్ణయంతో స్వామి ఉన్నట్లు తెలిసింది. తాజాగా టీటీడీ వద్దఉన్న ఆభరణాలను వెలకట్టించాలని కూడా ఆయన అంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పింక్ డైమండ్ విషయంలో ఆయన పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఈ పింక్ డైమండ్ ఎవరి హయాంలో మాయం అయ్యిందనే విషయంపై ఆరా తీయనున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా టీటీడీ ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ విచారణను డిమాండు చేయనున్నట్లు తెలిసింది. టీటీడీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని కూడా సుబ్రమణ్యం స్వామి ఆరోపిస్తున్నారు. రమణ దీక్షితులు ఆరోపణ చేసినట్లు పోటును ఎందుకు మరమ్మతుల పేరుతో తవ్వాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించనున్నారు. పోటులో నిధులు కోసం మరమ్మతుల పేరుతో తవ్వించారా అని విషయం కూడా సీబీఐ ద్వారా నిర్ధారణ కావాల్సి ఉందని స్వామి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ పెద్దలు కూడా ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నారు.