పశ్చిమలో 'కొత్త ' రాజకీయాలు...తెరపైకి వస్తోంది వీరే ..?       2018-05-25   03:35:53  IST  Bhanu C

రాజకీయంగా గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీనే అధికారం చేజిక్కించుకోవడం పరిపాటి. మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ మొత్తం అన్ని సీట్లు టీడీపీ సొంతం చేసుకుంది. ( పొత్తులో భాగంగా ఒక అసెంబ్లీ , ఒక పార్లమెంట్ బీజేపీకి టీడీపీ కేటాయించింది.) ఆ తరువాత అధికార పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. ఈ సారి గతంలోలా బలం నిలుపుకోవాలని టీడీపీ తహతహలాడుతుండగా.. కొంతైనా ఆ పార్టీని దెబ్బ తీయాలన్న ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.

బీజేపీతో టీడీపీ మైత్రి చెడిపోవడంతో నర్సాపురం పార్లమెంట్, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ లో కొత్త ముఖాలు తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీ లో కూడా ఈ సారి గతంలో పోటీ చేసిన వారి స్థానంలో కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగబోతున్నారు.

ఏలూరు అసెంబ్లీ సీటుకు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థిత్వం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరికి దక్కుతుందని అంటున్నారు. దెందులూరులో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ తరఫున కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దిగబోతున్నాడు.

ఉంగుటూరులో టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే మళ్లీ బరిలోకి దిగుతారు. వైసీపీ తరఫున ఈ నియోజకవర్గంలో పుప్పాల వాసుబాబు పోటీ చేయనున్నారు. చింతలపూడిలో టీడీపీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత మరోసారి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పార్టీలోని మరో వర్గంతో ఆమెకు సమస్యలు ఉన్నాయి. వ్యతిరేక వర్గంతో సఖ్యత కుదుర్చుకుని అందరినీ కలుపుకొని పోవాలని పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. ఆమె కాని పక్షంలో తమకు అవకాశం ఇవ్వాలని డాక్టర్‌ కర్రా రాజారావు, జడ్పీ మాజీ చైర్మన్‌ జయరాజు కోరుతున్నారు.
వైసీపీ తరపున ఐఆర్ఎస్‌ మాజీ అధికారిణి ఎలీజా పోటీ చేస్తారని టాక్ . పోలవరం (ఎస్టీ)లో కూడా టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుతో ఒక వర్గం విభేదిస్తోంది. తమకు కూడా అవకాశం ఇవ్వాలని బొరగం శ్రీనివాస్‌, కుంజా సుభాషిణి, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాస్‌ కుమార్తె కోరుతున్నారు. వైసీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకే అన్న టాక్ ఇక్కడ ఉంది.

డెల్టా విషయానికి వస్తే… అచంటలో మళ్ళీ టీడీపీ తరపున పితాని రంగంలో ఉండగా.. వైసీపీ నుంచి నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. నరసాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరినా అసెంబ్లీకి ఆయన పేరును పరిశీలించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానానికి ఏ కారణం వల్లనైనా రఘురామ కృష్ణంరాజు పేరు వెనక్కి వెళ్తే సుబ్బారాయుడిని నిలిపే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తిరిగి పోటీ చేయబోతున్నారు.

పాలకొల్లులో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు కానీ అయన స్థానంలో మరో బలమైన అభ్యర్థిని కానీ బరిలో ఉంచే అవకాశం కనిపిస్తుండగా .. వైసీపీ నుంచి గుణ్ణం నాగబాబు.. మేక శేషుబాబు పేర్లు వినిపిస్తున్నాయి. భీమవరం లో టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు కానీ .. టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తనయుడు జగదీశ్ కానీ బరిలో నిలిచే ఛాన్స్ ఉండగా .. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఉండగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కానీ యండగండి నరసింహరాజు కానీ పోటీలో ఉండబోతున్నారు. తణుకులో టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వంకా రాజకుమారి, ఆమె భర్త వంకా రవీంద్ర కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో టీడీపీ టికెట్‌ కోసం గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు ఉన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న ఈలి నాని తనకే టికెట్‌ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నా.. ఆయనకు మునిసిపల్‌ చైౖర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు కూడా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు టికెట్‌ వస్తుందని అంటున్నారు. వలవల బాబ్జీ కూడా పోటీదారుగా ఉన్నారు. ఇక జనసేన విషయానికి వస్తే ఇప్పటికి సరైన పార్టీ నిర్మాణం కానీ లేకపోవడంతో అభ్యర్థులు ఎవరనేది స్పష్టంగా చెప్పడం కష్టం.