పవన్ ఈ రేంజ్ లో ఆలోచించాడా..? అందుకేనా ఈ దూకుడు.     2018-05-21   01:02:50  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఏదో తెలియని కొత్త కాన్ఫిడెన్సు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏదో ఉన్నాం అన్నట్టు పార్ట్ టైములో స్పందిస్తూ .. ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు కొన్ని సమస్యల మీద మాత్రమే స్పందిస్తూ ట్విట్టరుడు అనే బిరుదు కూడా పొందాడు. కానీ ఇప్పుడు పవన్ లో స్పీడ్ పెరిగింది. నేను పాత పవన్ ని కాదు కొత్త పవన్ ని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనకి ఇంత హితబోధ కి కారణం ఏంటా అనేది ఇప్పటివరకు అర్ధం కాకపోయినా కర్ణాటకలో కుమారస్వామి జేడీఎస్ కు ఏర్పడిన ప్రాధాన్యం పవన్ లో సరికొత్త ఉత్సాహం.. ఆలోచన కలిగించినట్టు అర్ధం అవుతోంది.

ఏపీలో జనసేన – కర్ణాటకలో జేడీఎస్ రెండూ ఒక్కటే.. తక్కువ సీట్లు వచ్చినా సీఎం కుర్చీ కొట్టేయవచ్చు అని పవన్ కలలు కంటున్నాడు. అందుకే 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించారు. పోరాటయాత్ర పేరుతో బస్సుయాత్ర ప్రారంభించిన ఆయన తన కోరికను ప్రజల ముందు ఉంచారు.

పవన్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ అందరిని గందరగోళంలో పడేస్తుంటారు. ఒక్కోసారి తనకు అధికారం ముఖ్యం కాదంటారు. ప్రజలకు సేవ చేయాలంటే.. అధికారం ఉండక్కర్లేదంటారు. అధికారంలోకి రావాలంటే… చాలా అనుభవం ఉండాలని..అందుకే తొందర పడలేదంటారు. నేను గెలవను అని తెలుసు కానీ.. కొంత మందిని గెలవకుండా చేయగలనని కూడా ప్రకటిస్తూంటారు. ఇప్పుడు మాత్రం పూర్తి క్లారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

కర్ణాటక ఎఫెక్ట్ పవన్ ని బాగా ప్రభావితం చేసిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 36 సీట్లతోనే కర్ణాటకలో కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం అందుతోందని.. అందుకే పవన్ కల్యాణ్.. తాను మెజార్టీ సాధించకపోయినా… కచ్చింగా ఓ పాతిక, ముఫ్పై సీట్లలో గెలుస్తానని అంచనా వేస్తున్నారు. టీడీపీ, వైసీపీల్లో ఎవరికి తక్కువ సీట్లు వస్తే.. వారే జనసేనకు మద్దతు ఇస్తారని.. పవన్ కల్యాణ్‌కు వ్యూహకర్తలు చెప్పినట్లు తెలుస్తోంది. జేడీఎస్ లానే సీఎం పదవి ఇచ్చినవారికే తన మద్దతు అని చెప్పి కుర్చీ దక్కించుకోవాలని పవన్ మెదడులో ఉన్న ఆలోచన.

ఎప్పుడూ లేని విధంగా పవన్ ముఖ్యంన్త్రి అవుతా .. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పడం పవన్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపుతోంది. ఆయన ఫ్యాన్స్ దానికి అనుగుణంగానే సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ ఇదే కాన్ఫిడెన్స్ ఎన్నికల వరకు కొనసాగించగలిగితే ఇప్పుడు ఉన్న పరిస్థితికంటే కొంతమేర మెరుగవుతుంది తప్ప జేడీఎస్ స్థాయిలో మాత్రం చక్రం తిప్పే అంత ఛాన్స్ ఉండకపోవచ్చు .