న‌మ్మి వెంట న‌డిస్తే త‌మ్ముళ్ల‌నే ముంచేస్తున్న మంత్రి       2018-04-15   07:39:00  IST  Bhanu C

ముందొచ్చిన చెవుల కంటే వెన‌కాల వ‌చ్చిన కొమ్ములే వాడి అని ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయ‌ణకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంద‌ట‌. మ‌రీ ముఖ్యంగా ఏ పోరు అయినా ఉండొచ్చుగానీ ఇంటి పోరు మాత్రం ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు పెద్దలు. కానీ ఇప్పుడు అటు భార్య త‌ర‌ఫు వాళ్లు.. ఇటు సొంత త‌మ్ముళ్ల మ‌ధ్య న‌లిగిపోతున్నారు ఆది. రాజకీయంగా అన్న అడుగు జాడ‌ల్లో న‌డిచిన త‌మ్ముళ్లు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నార‌ట‌. మంత్రి అయిన త‌ర్వాత‌.. ఆదిలో పూర్తిగా మార్పు వ‌చ్చింద‌ని, త‌మ‌ను తీసిపారేస్తున్నార‌ని తీవ్రంగా ర‌గిలిపోతున్నార‌ట‌. అన్నీ భార్య త‌ర‌ఫు బంధువుల‌కే అన్న క‌ట్ట‌బెడుతుండ‌టాన్ని వీరు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. ముందు నుంచి ఉన్న త‌మ కంటే.. భార్య త‌ర‌ఫు బంధువులే ముఖ్య‌మ‌నేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆది తీరును ఎండ‌గ‌డుతున్నారు. అందుకే ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నార‌ట‌.

-

- Telugu


కేబినెట్‌లో చేరి ఏడాది గడిచిందో లేదో అప్పుడే మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. తన కుమారుడు, కుమార్తె భార్య తరఫు బంధువులకే అధిక ప్రాధాన్యమిస్తూ, అంతకంటే దగ్గర వారిని దూరం పెట్టాడని అతని వర్గీయులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ పెత్తనమంతా తన తోడల్లుడు, మామలకే కట్టబెట్టడం ఆరోపణలను బలపరుస్తోంది. దేవగుడి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దేవగుడి శంకర్‌రెడ్డి 1990లో జరిగిన ఫ్యాక్షన్‌ తగాదాల్లో హత్య గురైన అనంతరం కుటుంబ బాధ్యతలను నారాయణరెడ్డి నెత్తికెత్తుకున్నారు. 2004లో రాష్ట్రమంతా వైఎస్సార్‌ గాలి వీస్తున్న తరణంలో జమ్మలమడుగులో దేవగుడి నారాయణరెడి గెలుపు నల్లేరు మీద నడకే అని అందరు భావించారు. అలాంటి సమయంలో కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సొదరుడు ఆది నారాయణరెడ్డిని రంగంలోకి దించారు.

నాటి నుంచి నేటి వరకు ఆది తన గెలుపు పరంపరను కొనసాగించారు. ఇలా తనకు రాజకీయ అవకాశం కల్పించిన అన్న నారాయణరెడ్డి రుణం తీర్చుకునే దానిలో భాగంగా ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డిని రాజకీయ వారసుడిగా ఆది ప్రకటిస్తూ వచ్చారు. మంత్రి అయిన తర్వాత ఆది చర్యలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటమే కాకుండా తన సొంత కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకుని వస్తుండటం అన్నదమ్ముల మధ్య గ్యాప్‌నకు కారణమైంది. సుధీర్‌రెడ్డికి జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకునే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ విషయంలో తన చిరకాల ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గం నుంచి అవరోధాలు ఎదురైనప్పటికి పట్టుబట్టి మరి తన కుమారుడు సుధీర్‌రెడ్డికి పదవి ఇప్పించుకోగలిగారు.

రెండేళ్ల క్రితం ఆయన వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే సమయంలో అన్నదమ్ములందరనీ ఏకం చేసి సీఎం వద్ద తన బలగాన్ని ప్రదర్శించారు. అన్నదమ్ములకు ఇచ్చిన హామీలను మరచి నాటి నుంచి నేటి వరకు వీరిని ఒక్కసారి కూడా సీఎంతో భేటీ చేయించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మైలవరం జలాశయం గేట్లు ఎత్తే సమయంలో కూడా మైలవరం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న భూపేష్‌రెడ్డి గైర్హాజరు కావడం వారి మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలకు బలం చేకూర్చుతుంది. కలహాలు ఇలాగే కొనసాగితే మరి కొద్దిరోజుల్లోనే కుటుంబసభ్యులు బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగురవేసే పరిస్థితి ఎదుర‌వుతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.