దాని కోసం జనసేనాని ఆరాటం ! అందుకే ఈ యాత్ర ..?       2018-05-10   01:13:15  IST  Bhanu C

ఎన్నికల కోలాహలం సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నాడు, అలాగే టీడీపీ కూడా ఇప్పటికే దళిత తేజం అని, సైకిల్ యాత్ర అని ప్రజల్లో నిత్యం ఉండేలా ప్లాన్ చేసుకుని అమలు చేస్తోంది. ఇక మిగిలింది కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీనే . మీరు అందరూ ప్రజల్లో తిరగేస్తే మేము ఏమయిపోవాలి మేము జనాల్లో తిరుగుతాము అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మరో యాత్ర చేసేందుకు సిద్ధం అయిపోయాడు.

గ్రామ స్వరాజ్యం పేరుతో ఈనెల 15 నుంచి బస్సు యాత్ర చేపట్టేందుకు తగిన ప్రణాళికలు వేసుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఆయన అన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా ఓ ప్రత్యేక వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నాడు. యాత్ర వివరాలను ఈనెల 11న జనసేన అధినేత స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మే 15 బస్సు యాత్ర ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం అయినట్టు తెలుస్తోంది. గ్రామ స్వరాజ్య యాత్రను ముందుగా రాయలసీమ నుంచి ప్రారంభించి గుంటూరు జిల్లా పల్నాడు వరకు కొనసాగిస్తారని , ఆ తర్వాత రెండో విడత యాత్ర కు సంబంధించిన వివరాలు ప్రకటిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి.

యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ప్రాంతాల వారీగా కొంతమందికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల యాత్రను మారిశెట్టి రాఘవయ్య పర్యవేక్షిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లా టూర్‌ పర్యవేక్షణ బాధ్యతలను భానుకు అప్పగించారు. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లా బస్సు యాత్రను పార్థసారధి పర్యవేక్షిస్తారు. బస్సు యాత్ర సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గ్రామాల్లో బస చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈ యాత్ర ద్వారా నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం పెంచాలని పవన్ చూస్తున్నాడు. పనిలో పనిగా ఈ యాత్రలో ఉండగానే పార్టీలోకి మరికొంతమంది నేతలను ఆహ్వానించి ఎన్నికల నాటికి పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకునేలా పవన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడు.