తెలంగాణాలో ముందస్తు కంగారు ! స్పీడ్ పెంచిన 'కారు'       2018-06-22   02:17:45  IST  Bhanu C

కొద్ది రోజులుగా కారు స్పీడ్ జోరందుకుంది. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్ లో ఎక్కడ లేని కంగారు మొదలయ్యింది. అందుకే కారు స్పీడ్ పెంచే పనిలో పడ్డారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని కేసీఆర్ కి సమాచారం అందడంతోనే… ‘టార్గెట్‌ నవంబరు’ లక్ష్యంగా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. ‘ముందస్తు’ అంచనాలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

ప్రధాని మోదీ జమిలి ఎన్నికల ఆలోచన చేస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది నవంబరు-డిసెంబరుల్లోనే ఎన్నికలు వస్తాయనే కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి కొంత స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని, అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకు ‘కేసీఆర్‌ రుణం తీర్చుకుందాం’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని టీఆర్‌ఎ్‌సలోని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. ‘‘అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణాన్ని సుసాధ్యం చేస్తున్న కేసీఆర్‌ రుణం తీర్చుకోవడానికి టీఆర్‌ఎ్‌సకే మళ్లీ ఓటు వేయాలి’’ అని తాము ప్రజలకు చెప్పబోతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

ఇక అభివృద్ధి పనులను అన్నిటినీ నవంబరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం వివిధ శాఖల అధికార యంత్రాంగానికి స్పష్టంచేస్తోంది. ఉన్నత స్థాయి సమీక్షల్లో కీలక మంత్రులు ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తున్నారు. ‘‘నవంబరు తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డిసెంబరులో ఎన్నికలు రావచ్చు. అప్పటికి ఏ పని కూడా పెండింగ్‌లో ఉండవద్దు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి’’ అని చెబుతున్నారు.

నవంబరులో రెండో విడత పెట్టుబడి సాయం రైతులకు అందజేసి ముందస్తు ఎన్నికలకు వెళతామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ, కేంద్రం వెనక్కి తగ్గినా ముందస్తు ఎన్నికలు రాకుండా షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగినా తమకు నష్టం లేదని స్పష్టం చేస్తున్నారు. అప్పటికే పార్టీ, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు వేగవంతమై రాజకీయంగానూ మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.