చరణ్‌ కూడా రంగంలోకి..(బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆర్‌సీ)       2018-05-24   01:04:17  IST  Raghu V

సినీ తారలు, క్రీడా కారులు తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌లుగా కనిపించడం వల్ల తమ సేల్స్‌ భారీగా పెరుగుతాయనే అభిప్రాయం ఎక్కువ శాతం కంపెనీ యాజమాన్యాలు కలిగి ఉంటారు. అందుకే కోట్లు కుమ్మరించి స్టార్స్‌ను తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంటారు. తెలుగులో స్టార్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం కొత్తేం కాదు. ఎంతో మంది స్టార్స్‌ విభిన్నమైన కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా పని చేశారు. ఒకానొక దశలో మహేష్‌బాబు లెక్కకు మించిన బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా చేసి, హీరోగా కంటే బ్రాండ్స్‌ ద్వారానే ఎక్కువ సంపాదించాడు. సంవత్సరంలో దాదాపు 50 కోట్ల మేరకు ఆయనకు బ్రాండ్స్‌ ద్వారానే వచ్చాయి అంటే అతిశయోక్తి కాదేమో.

మహేష్‌బాబు తర్వాత ఇంకా పలువురు కూడా టాలీవుడ్‌ నుండి కమర్షియల్‌ యాడ్స్‌లో నటించేందుకు అడుగులు వేస్తున్నారు. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి వారు కూడా యాడ్స్‌లో నటించారు. వారి వారి స్థాయిని బట్టి పారితోషికాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌ ఈదిశగా అడుగులు వేయలేదు. అయితే మొదటి సారి ‘హాపీ’ మొబైల్‌ స్టోర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ సి, లాట్‌ మొబైల్స్‌ భారీ ఎత్తున ఉన్నాయి. అయినా కూడా హాపీ మొబైల్స్‌ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న హాపీ మొబైల్‌ స్టోర్స్‌ను ప్రతి చిన్న పట్టణంకు తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. అందుకే రామ్‌ చరణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 2.3 కోట్ల పారితోషికంను రామ్‌ చరణ్‌ ఈ ఒప్పందం కారణంగా పొందబోతున్నాడు. సంవత్సరం పాటు రామ్‌ చరణ్‌ హాపీ మొబైల్‌ స్టోర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం కొన్ని యాడ్స్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. కొన్ని స్టోర్స్‌ ప్రారంభోత్సవంతో పాటు, వారం రోజుల పాటు యాడ్స్‌ చిత్రీకరణకు డేట్లు కూడా ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ అంబాసిడర్‌గా చేయనుండటంతో హాపీ మొబైల్స్‌ స్థాయి పెరగడం ఖాయం.
చరణ్‌ రంగలోకి దిగుతున్న కారణంగా ఇతర హీరోలు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే పలు కంపెనీల ప్రతినిధులు కూడా తమ ఉత్పత్తులకు కూడా రామ్‌ చరణ్‌ను వాడేసుకోవాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే రామ్‌ చరణ్‌ ప్రస్తుతానికి హాపీ స్టోర్స్‌కు మాత్రమే అంబాసిడర్‌గా వ్యవహరించాలని భావిస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఇతర కంపెనీలకు సంతకం పెట్టే విషయమై ఆలోచిస్తాడని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతుంది.