క‌ర్ణాట‌క ప్ర‌చారంతో బాబు ర‌చ్చ రాజ‌కీయం..!       2018-05-07   00:06:49  IST  Bhanu C

అవును! బీజేపీ సోష‌ల్ మీడియా మొత్తం ఏపీ సీఎం చంద్ర‌బాబును ఏకిపారేస్తోంది. ఆయ‌న రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని అంటోంది. అంతే కాదు, రాజ‌కీయాల్లో త‌నకంటే సీనియ‌ర్ ఎవ‌డూ లేద‌ని, త‌న‌కు 40 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొంటున్న చంద్ర‌బాబు రోడ్డు సైడ్ రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని బీజేపీ సోష‌ల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వేలు పెట్ట‌డ‌మే! ఆయ‌న‌కు క‌ర్ణ‌టక రాజ‌కీయాల‌కు సంబంధం లేదు. అయినా కూడా అక్క‌డ బీజేపీని ఓడించాలంటూ.. అక్క‌డి తెలుగువారికి బాబు పిలుపు నిస్తున్నారు.

నిజానికి చంద్ర‌బాబు మాట‌ల‌కు అంత విలువ ఉంటే.. 2014లో ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాను ఎందుకు ఒంట‌రిగా పోరు చేయ‌లేక‌పోయారు? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో సొంత రాష్ట్రంలో ఆయ‌న అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయినా లోలోన ఏదో భ‌యం వెంటాడుతున్న నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సైతం త‌న‌కు అనుకూలంగా రంగంలోకి దింపుకొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 103 స్థానాల్లోనే టీడీపీ గెలుపొందింది. అంతేకాదు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీకావు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అని ఆ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించారు. రైతుల‌కు రుణ‌మాఫీ అంటూ రైతుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, డ్వాక్రా రుణ‌మాఫీ అంటూ మ‌హిళ‌ల‌ను త‌న వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. బాబు వ‌స్తే.. జాబు గ్యారెంటీ అంటూ.. య‌వ‌త‌కు గేలం వేశారు. ఇలా ఇన్ని హామీలు ఇచ్చిన‌ప్పుడు.. త‌న సీనియ‌ర్టీ బాణాన్ని ప్ర‌యోగించిన‌ప్పుడు, వ‌స్తున్నా మీకోసం పాద‌యాత్ర‌ను ప్లే చేసిన‌ప్పుడు 175లో క‌నీసం 150 అయినా వ‌చ్చి ఉండాలి క‌దా? కానీ, కేవ‌లం 103 స్థానాల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. మ‌రి సొంత రాష్ట్రంలోనే బాబు మాట‌ను తెలుగు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోన‌ప్పుడు.. క‌ర్ణాట‌క‌లో ఉన్న తెలుగు వారు బాబు మాట‌ల‌ను వింటారా? వారికంటూ సొంత మ‌నోభావాలు.. ఆశ‌లు ఆశ‌యాలు ఉండ‌వా? వారేమ‌న్నా తెలివిత‌క్కువ వారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

కేంద్రంలోని బీజేపీతో వైరం ఏర్ప‌డింద‌న్న ఒకే ఒక్క కార‌ణంగా చంద్ర‌బాబు చూపిస్తున్న దూకుడు రానున్న రోజుల్లో ఆయ‌న‌కే మంచిది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జాస్వామ్య దేశంలో రాష్ట్రాల హ‌క్కులకు భంగం వాటిల్లిన‌ప్పుడు న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యించ‌డం ఎక్క‌డైనా జ‌రిగేదే.ఈ క్ర‌మంలోనే విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు కోరుతూ ..చంద్ర‌బాబు న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యించ‌కుండా ర‌చ్చ‌రాజ‌కీయాల‌కు తెర‌దీయడం ఆయ‌న సీనియ‌ర్టీలోని లోపాన్ని వెలికి తీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌పంచానికి పాఠాలు చెప్పే చంద్ర‌బాబుకు ఇంత చిన్న సూత్రం తెలియ‌దా? అనేది కూడా ఉద‌యిస్తోంది.

కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఏమీ చేయ‌న‌ప్పుడు వెళ్లాల్సిన పంథాలో వెళ్లాలే కానీ, ఇలా రోడ్డు సైడ్ రాజ‌కీయాల మాదిరిగా.. ఎక్క‌డ ఎన్నిక‌లు జరిగితే.. అక్క‌డ బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తారా? అంటున్నారు. ఇదే ఏడాది రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌ల‌లోనూ ఎన్నిక‌లు ఉన్నాయి. మ‌రి అక్క‌డ కూడా బాబు ప్ర‌చారం చేయిస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా బాబు నిర్ణ‌యంపై మేధావులు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.