క‌న్న‌డ వార్‌... ఆరు ప్రాంతాల్లో మూడు పార్టీల హోరాహోరీ       2018-04-30   01:11:10  IST  Bhanu C

క‌న్న‌డ నాడి ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. హంగ్ త‌ప్ప‌ద‌ని స‌ర్వేలన్నీ చెబుతున్నాయి. మ‌రోసారి త‌మ‌కు అధికారం క‌ట్ట‌బెడ‌తార‌ని కాంగ్రెస్ న‌మ్మ‌కంతో ఉంటే.. కాంగ్రెస్‌ను ఈసారి ప్ర‌జ‌లు చీత్క‌రించుకుంటార‌ని, త‌మ‌దే క‌న్న‌డ పీఠం అని క‌మల‌నాథులు క‌న్ఫిడెన్ట్‌గా ఉన్నారు. ఇక త‌మ‌కూ అవ‌కాశం ద‌క్క‌క‌పోతుందా అని జేడీఎస్ కూడా ఎదురు చూస్తోంది. మ‌రి క‌న్న‌డ ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది? అందులోనూ ఆరు ప్రాంతాలుగా విడిపోయిన క‌ర్ణాట‌క‌లో ఏ ప్రాంతంలో ఎవ‌రు పై చేయి సాధిస్తారు? ఆరు భిన్న ప్రపంచాలైన కర్ణాటకలో ఏ పార్టీ అదృష్టం ఎలా ఉందో? అనే సందేహాలు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. పోలింగ్‌ రోజు(మే12) సమీపించే కొద్దీ.. క‌న్న‌డ నాటే కాదు దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది.

బ్రిటిష్‌ కాలంలో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌ నిజాం పాలనలోని కన్నడ ప్రాంతాలు, కొడగు, పాత మైసూరు ప్రాంతాలను కలిపి కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైందన్నది అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తాన్ని బొంబాయి, కోస్తా, హైదరాబాద్, పాత మైసూరు, మధ్య కర్ణాటక, బెంగళూరు అర్బన్‌ అనే ఆరు ప్రాంతాలుగా విభజిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో సీట్లవారీగా చూస్తే పాత మైసూరు, బొంబాయి కర్ణాటక పెద్ద ప్రాంతాలు. ఉడుపి, ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం 30 ఏళ్లుగా హిందుత్వ ప్రయోగశాలగా మారిందన్నది విశ్లేషకుల అంచనా. హిందూ, ముస్లిం, క్రైస్తవ జనాభా దాదాపు సమానంగా ఉన్న కరావళిలో మత ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎక్కువే. ఫలితంగా కాషాయ పక్షం వేగంగా వేళ్లూనుకుంది. ఈ కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడవిజయం సాధించింది.

అంతకు ఏడాది ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. య‌డ్యూరప్ప, బి.శ్రీరాములు వంటివారు బీజేపీ నుంచి వేరు పడి సొంత పార్టీలు పెట్టుకోవడం ఇందుకు కారణం. అప్పట్లో ఈ ప్రాంతంలోని మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్‌ 14 సీట్లు గెలుచుకుంది. యడ్యూరప్ప, శ్రీరాములు వంటి వారిప్పుడు మళ్లీ పార్టీలో చేరిపోవడం.. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసే కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌హెగ్డే, మాజీ మంత్రి శోభా కరండ్లాజే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ తదితరుల సాయంతో ఈ ప్రాంతంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. ఇక‌ లింగాయతుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బొంబాయి కర్ణాటకలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ ప్రాం తం బీజేపీ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు సొంత కుంపటి పెట్టుకోవడంతో నష్టపోయింది. మొత్తం 50 స్థానాలున్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 31 స్థానాలు సాధించగా బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది.

ఈసారి అంతేస్థాయిలో సీట్లు గెలుపొందేందుకు కాంగ్రెస్‌ లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్‌కు ఓకే చెప్పింది. ఆర్థిక వెనుకబాటు, కరువు, రైతు ఆత్మహత్యలు, మహాదాయి నదీ జలాల వివాదం, నిరుద్యోగం, చెరకు ధర వంటివి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలని అంచనా. రాష్ట్రంలో మరో వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్‌ కర్ణాటక. కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఆశలు కల్పిస్తున్న ప్రాంతమిదే. 2012లో యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రాజ్యాంగంలోని 371–జే ద్వారా ప్రత్యేక హోదా కల్పించింది. దీనివ‌ల్ల గతంకంటే తాము మెరుగైన స్థితిలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సిద్దరామయ్య. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్‌కు 23, బీజేపీకి ఐదు సీట్లు దక్కాయి. జేడీఎస్‌కు ఐదు సీట్లు లభించాయి. కేజీపీ మూడు స్థానాల్లో గెలిచింది. లింగాయతులు చెప్పుకో దగ్గసంఖ్యలో ఉన్న హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతం ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో.

చిత్రదుర్గ, దావణగెరె, చికమగళూరు, శివమొగ్గ జిల్లాలున్న మధ్య కర్ణాటకలో లింగాయతుల ప్రభావం కూడా ఉంది. 2008లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప సొంత జిల్లా శివమొగ్గతో కూడిన మధ్య కర్ణాటక కీలకపాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 13 సీట్లు దక్కించుకున్నాయి. గత ఎన్నికల్లో యడ్యూరప్ప సొంతంగా పార్టీపెట్టుకోవడంతో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్యను 15కు పెంచుకుంది. బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. జేడీఎస్‌ ఆరు చోట్ల విజయం సాధించింది. లింగాయతులకు ప్రత్యేక గుర్తింపు ప్రభావం ఎంతన్నది స్పష్టంగా తెలియడంలేదు. చిత్రదుర్గలో అనేక హిందూ వర్గాల మఠాలున్నాయి. వీటి ప్రభావం ఓటర్లపై ఉంటుందనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి అమిత్‌షా వరకూ మఠాధిపతులను కలవడానికి ’క్యూ’ కడుతున్నారు.

పూర్వపు మైసూరు సంస్థానమైన ఈ ప్రాంతంలో మైసూరు, కొడగు, మండ్య, హాసన్, చామరాజనగర, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ తదితర జిల్లాలున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, అతడి సామాజిక వర్గమైన ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. కాంగ్రెస్‌కు దళితులు, బీసీలు, అల్పసంఖ్య వర్గాల్లో పలుకుబడి ఎక్కువ. ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్యే. ఇక్కడ బీజేపీకి బలం అంతంతే. మొత్తం 61 స్థానాలకు 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 27, జేడీఎస్‌ 25 సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకుంది. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సహా దేవెగౌడ కుటుంబ సభ్యులు జేడీఎస్‌ తరఫున ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఒక్కళిగ వర్గానికి చెందిన మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ట పార్టీలోకి చేరడంతో ఈసారి జేడీఎస్‌ ప్రభావాన్ని తగ్గించగలమని బీజేపీ భావిస్తోంది.

ఇదే ప్రాంతంలోని చాముండేశ్వరి స్థానం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. అత్యంత సంపన్న అభ్యర్థిగా వార్తలకెక్కిన కాంగ్రెస్‌ మంత్రి(ఒక్కళిగ నేత) డీకే శివకుమార్‌ కూడా ఈ ప్రాంతంలోని కనకపుర నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ మళ్లీ గెలిస్తే ఆయన సీఎం అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. రాష్ట్ర రాజధాని బెంగళూరు కొన్నేళ్లుగా బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 28 సీట్లకు 12 స్థానాలు సాధించగలిగింది. కాంగ్రెస్‌ 13 సీట్లు కైవసం చేసుకుంది. ఐదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు, కలుషితమౌతున్న సరస్సులు, నానాటికి తీసికట్టుగా మారుతున్న రోడ్లు, వానాకాలంలో వరదలు, క్షీణిస్తున్న శాంతి భద్రతలు వంటి అనేక విషయాలు సిద్దరామయ్య సర్కార్‌కు సవాల్‌గా మారాయి.