క్రికెట్ బెట్టింగ్ ఉచ్చులో గుంటూరు ఎమ్మెల్యే..!       2018-06-03   00:57:35  IST  Bhanu C

ఏపీలో బాద్య‌త గ‌ల ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉంటూ జూదాల‌ను, క్రికెట్ బెట్టింగుల‌ను స్వ‌యంగా ఎమ్మెల్యేలే ప్రోత్స‌హిస్తుండ‌డం దారుణం. ఈ లిస్టులో రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నీసం కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు ప్ర‌ముఖంగా తెర‌మీద‌కు వ‌స్తున్నా… తెర‌వెన‌క మాత్రం 15మందికి త‌గ్గ‌కుండా స్వ‌యంగా బెట్టింగ్ ముఠాల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తెలంగాణ బోధ‌న్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ష‌కీల్ అహ్మ‌ద్ బెట్టింగ్ ముఠాకు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఏపీలో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి కూడా బెట్టింగ్ ఆరోప‌ణ‌లు ప‌లుసార్లు విచార‌ణ‌లు ఎదుర్కొన్నారు.ఈ విష‌యంలో కోటంరెడ్డి మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. వైసీపీ వాళ్లు సైతం ఆయ‌న బెట్టింగ్ విష‌యాన్ని ఆఫ్ ద రికార్డుగా అంగీక‌రించారు. ఇక ఇప్పుడు అదే వైసీపీకి చెందిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యే సైతం బెట్టింగ్ ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతోనే క్రికెట్‌ బెట్టింగ్‌లు
జరుగుతున్నాయని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ప‌ల్నాడులో భారీ ఎత్తున జ‌రుగుతోన్న క్రికెట్ బెట్టింగుల‌పై పోలీసులు కొద్ది రోజులుగా పంజా విసురుతున్నారు. తాజాగా బెట్టింగుల స్థావ‌రాల‌పై పోలీసుల దాడుల్లో రామాంజనేయరెడ్డి, ఉడుముల శివరామిరెడ్డి, భూమిరెడ్డి కోటిరెడ్డి, మరెళ్ళ రామిరెడ్డి, రెడ్డిపాలెం క్రిష్ణారెడ్డి, బేసవరం లింగారెడ్డి ప‌ట్టుబ‌డ్డారు. వీరంతా వైసీపీ నాయకులు అని, వారు ఎమ్మెల్యే అందడండలతో క్రికెట్‌ బెట్టింగ్‌లు నడుపుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే తిరుమ‌ల యాత్ర వీడియోలు చూస్తే వీరంతా ఆయ‌న వెంటే ఉన్నార‌ని… ఎమ్మెల్యే వీరికి అండ‌గా ఉంటున్నార‌ని చెప్పేందుకు ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏం కావాల‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. టీడీపీ అవినీతిపై విమ‌ర్శ‌లు చేస్తోన్న ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగుల‌తో యువ‌త జీవితాల‌తో ఆట‌లు ఆడుకునే వారికి స‌పోర్ట్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని టీడీపీ నాయ‌కులు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు.

ఇదిలా ఉంటే ఇదే గుంటూరు జిల్లాలో అధికార పార్టీకే చెందిన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే కూడా తెర‌వెన‌క ఉంటూ ఈ బెట్టింగ్ తంతును న‌డిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ వ‌ల్ల స‌ర్వ‌స్వం కోల్పోయిన ఇద్ద‌రు యువ‌కులు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం కూడా పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది. ఏదేమైనా బాధ్య‌తక‌ల ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉంటూ ఇలాంటి వాటిని ఎంక‌రేజ్ చేయ‌డం వారి అనైతిక‌త‌ను తెలియ‌జేస్తోంది.