సాధారణంగా కోతులు చేసే అల్లరి పనులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అవి చేసే అల్లరి చేష్టల ద్వారా కొన్నిసార్లు ఎంతో నష్టం వాటిల్లుతుంది.
మరి కొన్ని సార్లు మన ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.ఇలా కోతులు తమ చేష్టల ద్వారా అందరిని విసిగిస్తూ ఉండడం సహజమే.
ఒక కోతి ఇలాంటి అల్లరి చేష్టలు ద్వారా వరంగల్ జిల్లాలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.పూర్తి వివరాల్లోకి వెళితే…
వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని దుర్గ పత్తి మిల్లులో అకస్మాత్తుగా సాయంత్రం ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ అగ్ని ప్రమాదంలో మిల్లు వాతావరణంలో ఉన్న పత్తి మొత్తం మంటలలో కాలిపోయింది.అయితే ఈ ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన మిల్లు యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారాన్ని అందజేశారు.
ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.అయితే ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏమిటని ఆరా తీయగా… కేవలం ఒక కోతి వల్ల ఇంతటి ప్రమాదం సంభవించిందని వారు తెలియజేశారు.
మిల్లులోని ట్రాన్స్ఫార్మర్ వద్ద హై టెన్షన్ వైరు పైకి ఒక కోతి ఎగరడంతో నిప్పురవ్వలు బయటకు వచ్చి పక్కన ఉన్న పత్తి పై పడ్డాయి.దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దాదాపు 2000 క్వింటాళ్ల మేర పత్తి దగ్ధమైంది.
ఇంత పత్తి మంటలలో కాలిపోవడంతో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.అయితే ఆ పత్తి పై ఇన్సూరెన్స్ ఉన్నట్లు మిల్లు యాజమాన్యం తెలిపింది.
పోలీసులు కేసును నమోదు చేసుకొని ఈ ప్రమాదం కోతుల వల్ల సంభవించినదా? లేదా మరొక కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.