కేసులేస్తున్నాడు... అందుకే కేసులో ఇరికించారా..?       2018-05-23   01:14:29  IST  Bhanu C

ఏపీలో అధికార పార్టీ టీడీపీని భయపెట్టి కంటిమీద కునుకులేకుండా చేస్తూ అధికార పార్టీకి కంటిలో నలుసుగా మారిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కరే. వైసీపీ తరపున గెలిచిన ఆర్కే నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రతి పనికి అడ్డు తగులుతూ చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో ఇతడి మీద గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఇతడి ఆగడాలను అడ్డుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది. ఆ సమయం డీఎస్పీ దుర్గాప్రసాద్ రూపం లో వచ్చింది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదలు నిర్వహించగా ఆర్కే కుటుంబసభ్యులకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటపడినట్టు చెప్పి ఏసీబీ నోటీసులు జరీ చేసింది. అయితే ఇదంతా యాదృచ్చికంగా జరిగిందా లేక ఇందులో ప్రభుత్వం కుట్ర ఉందా అనేది అనుమానంగా ఉంది అంటున్నారు వైసీపీ నేతలు .

ఇదేవిధంగా ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పై క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేశారు. ఆయన విచారణకు కూడా పిలిపించారు. తనకు ఏం సంబంధం లేదని కోటంరెడ్డి చెబుతున్నా పోలీసు విచారణకు రావాల్సిందేనని అంటున్నారు. ఆయా తరువాత ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదవుతున్నాయి. డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆస్తులు కొన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబీకుల పేరిట ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల అఫడవిట్ లోనూ ఈ ఆస్తులు పేర్కొనకపోవడంతో అనుమానం వచ్చి ఏసీబీ అధికారులు ఆయనను విచారణకు పిలిపించారు. అయితే ఆయనకు కంటి ఆపరేషన్ ఉండటంతో ఆయన తరుపున లాయర్ హాజరయ్యారు. ఈ నెల 29వ తేదీన హాజరుకావాలని ఆర్కే కు ఏసీబీ అధికారులు ఆదేశాలు జరీ చేసారు.

నాలుగేళ్లుగా ఆర్కే చేసింది ఇదే..

ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆర్కే కోర్టులలో కేసు వేయడం పరిపాటిగా మారింది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూ సమీకరణ చేపడితే ఆయన రాజధాని రైతులతో కలసి న్యాయపోరాటానికి దిగారు. అలాగే సదవర్తి భూముల వేలం విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. . ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు . టీడీపీ నేతలపై ఉన్న 132 క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఎత్తివేయడంపై కూడా ఆర్కే హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఇలా వరుసగా అన్ని పనులకూ అడ్డుతగులుతున్న ఆర్కేపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది.

,