కేసీఆర్‌కు పోటీగా బాబు ఫ్రంట్‌ ఏర్పాట్లు       2018-05-24   03:27:56  IST  Bhanu C

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయి రాజకీయాలపై ఈమద్య దృష్టి పెట్టిన విషయం తెల్సిందే. మొన్నటి వరకు బీజేపీకి కాస్త దగ్గరగా ఉన్నట్లుగా కనిపించిన కేసీఆర్‌ ప్రస్తుతం ఆ పార్టీపై అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా మండి పడుతున్నారు. కాంగ్రెస్‌ మరియు బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు గ్రౌండ్‌ లెవల్‌లో అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే పది ప్రాంతీయ పార్టీల అధినేతలను కలవడంతో పాటు వారికి తృతీయ ఫ్రంట్‌ ప్రాముఖ్యతను తెలియజేసినట్లుగా సమాచారం అందుతుంది.

కేసీఆర్‌ నాయకత్వంలో తృతీయ ఫ్రంట్‌కు పలు ప్రాంతీయ పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి. ఎక్కడో ఉత్తరాదిన ఉన్న పార్టీల అధినేతలను కలిసిన కేసీఆర్‌ ఇప్పటి వరకు పక్క తెలుగు రాష్ట్రం చంద్రబాబు నాయుడును మాత్రం సంప్రదించలేదు. ఇటీవలే కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనకు మిత్రుడు అని, తప్పకుండా తాను అనుకున్నట్లుగా ఆయన మా ఫ్రంట్‌కు మద్దతు పలుకుతాడని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలోనే చంద్రబాబు నాయుడును కలిసి థర్డ్‌ ఫ్రంట్‌ విషయమై చర్చిస్తాను అంటూ కేసీఆర్‌ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈలోపే కేసీఆర్‌కు సవాల్‌ అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు.

కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ చర్చల్లో ఉండగా చంద్రబాబు నాయుడు కూడా తన నాయకత్వంలో థర్డ్‌ ఫ్రంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడుపై ఎక్కువ పార్టీలు నమ్మకంగా ఉన్నాయి. అందుకే ఆయన నాయకత్వంలో తృతీయ ఫ్రంట్‌కు ఓకే చెప్పే అవకాశం ఉంది. తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నాడు. ఒకవేళ తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటుకు సీట్లు సంపాదించలేని పక్షంలో కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల కర్ణాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ల సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. సీఎంగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారంకు చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. ఆ సమయంలో దాదాపు 10 ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాహుల్‌ గాంధీతో కూడా చర్చలు జరిపాడు. ఇలా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా పావులు కదుపుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు చేస్తున్న ఈ ఫ్రంట్‌ ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయి అనేది అందరికి ఆసక్తికరంగా ఉంది. వీరిద్దరు కలిసి ఫ్రంట్‌ ఏర్పాట్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మాత్రం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కలుస్తారా లేదా విడివిడిగానే జాతీయ స్థాయిలో పోరాడుతారో చూడాలి.