''కమ్మ'' గా స్కెచ్ వేస్తున్న జగన్ !       2018-06-01   00:49:03  IST  Bhanu C

రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సర్వసాధారణమే. మన బలం కంటే ఎదుటివాడి బలం ఏంటో తెలుసుకుని ఆ రూట్లే వెళ్తే విజయం సులువుగా దక్కుతుందని రాజకీయా పార్టీలు ఆలోచిస్తుంటాయి. ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా అదే రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి కావాల్సిన అన్ని దారులను వెతుకుతున్నాడు. అందుకే ముందుగా టీడీపీ కి బలమైన ” కమ్మ” సామాజికవర్గం పై దృష్టిపెట్టాడు. ఆ వర్గాన్ని ఆకర్షించడం వల్ల టీడీపీని దెబ్బకొట్టడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో సులువుగా విజయం దక్కించుకోవచ్చని జగన్ స్కెచ్ .

పార్టీ అధికారంలోకి రావాలంటే ఎక్కడా రాజీపడకుండా, పక్కాగా గెలుపు గుర్రాలనే ఎంచుకోవాలన్నది వైసీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగానే అధికారం కొంచెం లో మిస్ అయింది అనే భావన జగన్ లో ఉంది. అందుకే ఈ సారి అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు. అందులో భాగంగా అమరావతి పరిసర జిల్లాల్లో బలమున్న కమ్మ సామాజికవర్గంపై విపక్షనేత గురిపెట్టినట్లు సమాచారం. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కమ్మసామాజికవర్గం ఓటు బ్యాంక్‌ని తమవైపు తిప్పుకునేందుకు.ఆ వర్గానికే ఎక్కువ సీట్లిచ్చే ఆలోచనలో జగన్‌ ఉన్నారనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది.

ఎన్నికల్లోపు కమ్మ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతల్ని తమవైపు తిప్పుకుని, వారికి బలమున్న చోట్ల నిలబెడితే తిరుగుండదనే ప్లాన్‌తో ఉన్నారట వైసీపీ అధినేత. రాజధాని అమరావతి పరిసరాల్లో కమ్మ సామాజికవర్గం.. మొదట్నించీ టీడీపీకి బలమైన ఓటుబ్యాంక్‌గా ఉంది. అందుకే ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సామజిక వర్గం వారికే అన్ని టికెట్లు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయిపోయాడు. దీంతో పాటు పెద్ద ఎత్తున ఆ సామాజికవర్గం నేతలను పార్టీలోకి తీసుకొచ్చే వ్యూహాన్ని సీక్రెట్ గా అమలుచేస్తునాడు. అనులో భాగంగానే జగన్‌ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి వైసీపీలో చేరారు. మరికొందరు నేతలు కూడా ఆయన బాటలోనే నడిచారు.

కమ్మ సామాజికవర్గ నేతల్ని ఆకర్షించే బాధ్యతని రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో నమ్మకస్తులైన నేతలకు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఆ సామాజికవర్గానికి చెందినవారే. దాదాపు 30కి పైగా అసెంబ్లీ సీట్లున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. అందుకే విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలతో పాటు గన్నవరం, పెనమలూరు టిక్కెట్లు ఆ వర్గానికే కట్టబెట్టే ఆలోచనలో వైసీపీ ఉంది.