కమలం మారుతుందా ..? వాడుతోందా ..?       2018-06-02   01:46:57  IST  Bhanu C

కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ బీజేపీకి ప్రస్తుతం గడ్డుపరిస్థితులు నడుస్తున్నాయి. గతంలో ఆ పార్టీకే ఉన్న క్రేజ్ అమాంతం పాతాళానికి పడిపోయింది. నరేంద్ర మోడీ పాలన పైన నిర్వహించిన సర్వే లు కూడా ఇదే వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. పై పెచ్చు కర్ణాటకలో అధికారం చిక్కినట్టే చిక్కి చేజారిపోవడం, ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంపాలు అవ్వడం ఆ పార్టీ ఛరిష్మాని దెబ్బకొట్టింది. దీనికి తోడు ప్రాంతీయ పార్టీలతో సున్నం పెట్టుకోవడం.. అవన్నీ ఇప్పుడు కూటమిగా ఏర్పడి బీజేపీ అంతం చూడాలని పట్టుదలకు పోవడం బీజేపీ పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతోంది.

ఒకప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన పార్టీ ఇప్పుడు అధికార దాహం తో పని చేస్తుంది అన్న భావన కూడా కమల విలాపానికి కారణమేమో అని భావిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేయాలన్న బిజెపి కల కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. మోడీ గ్రాఫ్ రాను రాను తగ్గిపోతుంది. చాలా శక్తివంతమైన నాయకుడిగా వున్న మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చెయ్యటం , ధరల పెరుగుదల, జీఎస్టీ మొదలయినవి బీజేపీ కొంపముంచుతున్నాయి.

ఉప ఎన్నికల ఫలితాలలో రెండు లోక్ సభ స్థానాలు మినహాయించి అన్ని చోట్లా విపక్ష కూటమే విజయం సాధించడంతో కమలనాథులు కలవరపడాల్సి వస్తోంది. బిజెపి అతి కష్టం మీద రెండు లోక్ సభ స్థానాలను నిలబెట్టుకోగలిగింది. అందులోనూ ఒక స్థానం మిత్రపక్షానిది. అంటే మూడు సిట్టింగ్ స్థానాలకు ఒక్క స్థానం మాత్రమే నిలుపు కోగలిగింది. మిగిలిన రెండు స్థానాలూ కాంగ్రెస్ మిత్ర పక్షాలు చేజిక్కించుకున్నాయి. సిట్టింగ్ స్థానాలు కూడా దక్కించుకోలేకపోవటం తో కమల నాధులు ప్రస్తుతం ఓటమికి గల కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.

మహారాష్ట్రలోని పాల్ఘడ్ లో శివసేన అభ్యర్ధిపై బిజెపి విజయం సాధించింది. ఇక యూపీలోని కైరానా లోక్ సభ నియోజక వర్గంలో ఆర్ ఎల్డీ అభ్యర్ధి గెలిచారు.. ఇక్కడ విపక్షాలన్నీ కలసి బిజెపికి పోటీగా ఒకే అభ్యర్ధిని రంగంలోకి దించడంతో విజయం సాధ్యపడింది. జోకీహాట్ నియోజక వర్గంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడి అభ్యర్ధి ఘన విజయం సాధించారు. అటు బీహార్ లో బిజెపి మిత్రపక్షమైన జేడియూకి ఎదురుదెబ్బ తగిలింది.కర్ణాటకలో ఆర్ ఆర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం పెరిగినట్లయ్యింది.

ఇక పశ్చిమ బెంగాల్ లోని మహేస్తల నియోజక వర్గం నుంచి తృణమూల్ అభ్యర్ధి విజయం సాధించి ప్రాంతీయ పార్టీల సత్తా చాటారు .. జార్ఖండ్ లోని గోమియాలో బిజెపి, సిలీ స్థానంలో జేఎంఎం అభ్యర్ధులు గెలుపొందారు.. ఇక మేఘాలయలో అంపటి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారు. దీంతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజా గెలుపుతో 60 స్థానాలున్న మేఘాలయలో కాంగ్రెస్ బలం 21కి చేరింది. మరోవైపు కేవలం రెండు సీట్లున్న బిజెపి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కర్ణాటక తరహాలో మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నించనుందని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని కమలనాధులు తమ వ్యూహాన్ని మార్చుకుంటారో లేక ఇవన్నీ షరా మాములే అని ముందుకు వెళ్తారో చూడాలి. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు తమ వ్యూహాన్ని మార్చుకోకపోతే బీజేపీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమే.