ఏయన్నార్‌ మూవీ వద్దే వద్దు.. ఎందుకంటే       2018-05-31   20:48:39  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల జోరు కొనసాగుతుంది. వరుసగా తెలుగు ప్రేక్షకుల ముందుకు బయోపిక్‌లు వస్తున్నాయి. భారీ ఎత్తున ఇటీవలే ‘మహానటి’ చిత్రం విడుదలైంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సావిత్రి జీవిత చరిత్రకు కాస్త డ్రామా యాడ్‌ చేసి, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడివ్వడం వల్ల సినిమాకు మంచి ఆధరణ లభిస్తుంది. మహానటి సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధిస్తూ టాప్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. శ్రీమంతుడు రికార్డును బ్రేక్‌ చేసింది అంటే సినిమా ఏ రేంజ్‌లో దూసుకు పోతుందో అర్థం చేసుకోవచ్చు.

మరో వైపు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోతున్నాడు. రెండు మూడు నెలల్లో ‘ఎన్టీఆర్‌’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతుంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని అప్పుడు విశ్లేషకులు అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. ఇక రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇలా వరుసగా బయోపిక్‌లు వస్తున్న కారణంగా ఏయన్నార్‌ బయోపిక్‌ను కూడా తీసేందుకు పలువురు సినీ ప్రముఖులు మరియు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే పదుల సంఖ్యలో దర్శకులు ఏయన్నార్‌ బయోపిక్‌కు అనుమతించాల్సిందిగా అక్కినేని ఫ్యామిలీని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా నాగార్జున నో అంటూ చెబుతూ వస్తున్నాడు. తాజాగా ‘ఆఫీసర్‌’ చిత్రం ప్రమోషన్‌ సమయంలో కూడా నాగార్జునతో మీడియా వారు అందరి బయోపిక్‌లు వస్తున్నాయి. ఏయన్నార్‌ గారి గురించి ప్రేక్షకులు తొసుకోవాలని కోరుకుంటున్నారు. వారి కోసం అయినా సినిమాకు అనుమతించొచ్చు కదా అని అడిగారు. అందుకు సమాధానంగా నాగార్జున నో అంటూ చెప్పుకొచ్చాడు.

నాన్నగారి బయోపిక్‌ను తీయాలనే ఆలోచన లేదని, ఎవరైనా తీస్తాను అంటే కూడా తాము ఆసక్తిగా లేమని చెప్పుకొచ్చాడు. నాన్నగారి సినిమాను ఎవరు చూడరు, ఎందుకంటే ఆయన జీవితంలో సినిమాటిక్‌ సంఘటనలు ఏమీ లేవు. ఆయన జీవితం మొత్తం సాఫీగా సాగింది. ఆయన జీవిత చరిత్ర సినిమాను తెరకెక్కించాలి అంటే క్లైమాక్స్‌ యాంటీగా చూపించాలి. అది అక్కినేని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేరు. తమ ఫ్యామిలీ కూడా అందుకు సిద్దంగా లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. అందుకే నాన్నగారి సినిమాకు నో చెబుతున్నాను. అయితే నాగార్జున నిర్ణయంలో మార్పు రావాలని అక్కినేని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ఏయన్నార్‌ బయోపిక్‌ రావాలని కోరుకుంటున్నారు.