ఎవ్వరూ తగ్గట్లేదు ... టీటీడీ లో వివాదాన్ని ఇలాగే వదిలేస్తారా ..?       2018-05-22   01:13:20  IST  Raghu V

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారుతోంది. మాజీ ప్రధాన అర్చకుడు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అంతే కాదు రాజకీయ రంగు పులుముకుని మరింత పెద్ద వివాదంగా మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. రమణ దీక్షితులు ఆరోపణలు దానికి టీటీడీ , కొంతమంది బ్రాహ్మణ సంఘాల కౌంటర్ లతో రోజురోజుకు ఈ వివాదం పెద్దదవుతుందే కానీ తగ్గడం లేదు.

-

అభివృద్థి పేరుతో పురాతన నిర్మాణాలను, ప్రాకారాలను పునాదులతో సహా పెకిలించి వేయడంతోపాటు స్వామి వారి ఆలయంలో తయారుచేయాల్సిన ప్రసాదాలను ఆగమశాస్త్రానికి విరుద్థంగా బయట తయారు చేసి ఆలయంలోకి తీసుకొస్తున్నారంటూ కొత్త విషయాలను బయటపెట్టారు. గర్భాలయం పక్కన ఉన్న పోటును 25 రోజులుగా ఎందుకు మూసేశారని ప్రశ్నిస్తున్నారు. వంటావార్పు, అర్చకులు తప్ప నైవేద్యానికి వినియోగించే ప్రసాదాలను ముందుగా వేరొకరు చూడకూడదని కానీ అలాంటి నిబంధనలు ఏవీ ఆలయంలో అమలు జరగడంలేదని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. అంతేనా .. శ్రీవారి గరుడ సేవలో వినియోగించే ఐదు వరుసల వజ్రాలు పొదిగిన ప్లాటినం హారంలో గులాబీ వజ్రం మాయమయ్యి విదేశాల్లో వేలంలో అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసారు.

టీటీడీ ఈవో ఈ వ్యవహారం పై స్పందిస్తూ.. రమణ దీక్షితులు చేసిన ఏ ఆరోపనల్లోనూ నిజం లేదని చే[ప్పుకోచ్చారు. 1956 టీటీడీ నిబంధనల ప్రకారం ఉద్యోగులతో పాటు అర్చకులకు ఒకే రూల్స్ వర్తిస్తాయన్నారు. అలాగే ౨౦౧౩ జనవరిలో జిఓ నెంబర్ 611ప్రకారం అర్చకులకు 65సంవత్సరాలకు రిటైర్డ్ మెంట్ ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీని ప్రకారమే గతంలో ఎ.ఎస్.రమణదీక్షితులు, భక్తవత్సలదీక్షితులు, రామచంద్రదీక్షితుల రిటైర్డ్ మెంట్ జరిగిందన్నారు. రిటైర్డ్ మెంట్ అయిన అర్చకుల స్థానంలో వారి కుటుంబంలోని వారినే నియమించామన్నారు.

శ్రీవారి ఆభరణాల విషయంలో రమణ దీక్షితుల ఆరోపణల్లో నిజం లేదని, అవసరం అయితే ఆభరణాలు అన్నిటిని తొందర్లోనే ప్రదర్శించి అందరి అనుమానాలు తీర్చుతామన్నారు. రమణదీక్షితులు చేసిన ప్రతి ఆరోపణ నిరాధారమైనదిగా పేర్కొంటూ దానికి సంబంధించిన పత్రాలను టిటిడి విడుదల చేసింది. గతంలో ఆభరణాల మాయం ఆరోపణలకు సంబంధించి వాగ్దా కమిటీ ఇచ్చిన క్లియరెన్స్ రిపోర్ట్, గరుడ సేవ హారంలో గులాబీ వజ్రం మాయానికి సంబంధించి జస్టిస్ జగన్నాథరావు ఇచ్చిన క్లియరెన్స్ రిపోర్ట్, పోటు విస్తరణ అవసరమంటూ గతంలో ఆగమసలహాదారుని హోదాలో స్వయంగా రమణదీక్షితులు టిటిడికి ఇచ్చిన సూచనల లేఖలను విడుదల చేసింది.

దానికి తోడు ఈ వ్యవహారం కుడా క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ స్పందించగా.. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. టీటీడీలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరతానంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. పరిస్థితి చూస్తుంటే ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడంలేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.