ఎంత పబ్లిసిటీ చేసినా, అంచనాలు పెరగలేదే(ఎవరికి ఆసక్తి లేదు)       2018-05-24   01:13:12  IST  Raghu V

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా కమర్షియల్‌ బ్రేక్‌ను దక్కించుకున్న నాగశౌర్య ఆ తర్వాత వరుసగా సాదా సీదా చిత్రాల్లో నటించి పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ సినిమాలు ఇలా వచ్చి అలా పోయాయి. ఆ సమయంలోనే నాగశౌర్యకు ‘ఛలో’ చిత్రంతో సూపర్‌ హిట్‌ దక్కింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఈయన వరుసగా చిత్రాలు ఓకే చేస్తున్నాడు. ఈ సమయంలోనే చాలా నెలల క్రితం ప్రారంభించిన ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంను ఆరు నెలల క్రితమే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.

‘ఛలో’ చిత్రం చేస్తున్న సమయంలోనే ఈ సినిమాను ప్రారంభించారు. ఆ సినిమా సొంత సినిమా అవ్వడంతో నాగశౌర్య ఎక్కువగా ఛలో సినిమాపై దృష్టి పెట్టాడు. దాంతో అమ్మమ్మగారిల్లు చాలా ఆలస్యం అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన షామిలి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. తెలుగులో బాల నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన షామిలి ‘ఓయ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో షామిలి మళ్లీ సినిమాలకు దూరం అయ్యింది. ఇక తెలుగులో ఈమె నటిస్తుందో లేదో అని భావిస్తున్న సమయంలో నాగశౌర్య ఆమెను ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

గత వారం పది రోజులుగా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని ఛానెల్స్‌లో కూడా సినిమా ప్రమోలు తెగ పడుతున్నాయి. ఇంత పడుతున్నా కూడా ప్రేక్షకుల్లో ఈసినిమాపై పెద్దగా ఆసక్తి కలగడం లేదు. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్‌లు కూడా ఆసక్తి చూపడం లేదు. దాంతో నిర్మాత స్వయంగా విడుదలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. సినిమాకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నప్పటి ప్రేక్షకుల్లో ఆసక్తి కలగక పోవడం, ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుకోక పోవడంతో సినీ వర్గాల వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నాగశౌర్య చిత్రం అమ్మమ్మగారిల్లు సినిమాకు చిత్ర యూనిట్‌ సభ్యులు సరైన రీతిలో పబ్లిసిటీ చేయడం లేదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తున్నారు తప్ప పబ్లిసిటీని ఆకట్టుకునే విధంగా, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా చేయడంలో వారు విఫలం అయ్యారు. అందుకే సినిమా గురించి ఏ ఒక్కరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈనెల 25న అంటే రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాని ప్రేక్షకులు మాత్రం సినిమా విడుదలను పట్టించుకోవడం లేదు. ఒక వేళ సినిమాలో మ్యాటర్‌ ఉంటే అప్పుడు ప్రేక్షకులు సినిమాను ఆధరిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.