ఇంత జరిగాక బంగార్రాజు వస్తాడా?       2018-05-27   01:56:24  IST  Raghu V

‘సోగ్గాడే చిన్ని నాయన’ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రను మాత్రం ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోవడం లేదు. ఆ సినిమా సక్సెస్‌లో బంగార్రాజు పాత్ర కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బంగార్రాజుగా నాగార్జున ఆకట్టుకున్నాడు. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ బంగార్రాజు పాత్రను అద్బుతంగా తెరకెక్కించాడు అంటూ విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అందుకే బంగార్రాజు పాత్ర చుట్టు ఒక కథను అల్లు మరో సినిమాను తీయాలని నాగార్జున కోరుకున్నాడు.

కళ్యాణ్‌ కృష్ణ ‘బంగార్రాజు’ చిత్రం కోసం చాలా కథలు సిద్దం చేశాడు. రారండోయ్‌ వేడుక చూద్దాం చిత్రం తర్వాత బంగార్రాజు వెండి తెరపైకి రాబోతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా బంగార్రాజు ఆలస్యం అవుతూ వస్తుంది. నాగార్జున ఇతరత్ర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల రవితేజతో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ‘నేలటిక్కెట్టు’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేలటికెట్టు దారుణమైన పరాజయం పాలైంది. కనీసం వారం రోజులు కూడా ఆ సినిమా థియేటర్లలో ఉండే పరిస్థితి లేదు. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేశాడు.

నేలటిక్కెట్టు చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణకు ఉన్న పేరు మొత్తం పోయింది. ఆయనతో సినిమాలు చేయాలనుకున్న యువ హీరోలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఇక చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న బంగార్రాజు చిత్రం కూడా ఉంటుందో ఉండదో అనే అనుమానాలు మొదలు అయ్యాయి. ఇటీవల నాగార్జున మాట్లాడుతూ తప్పకుండా బంగార్రాజును చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. బంగార్రాజు పాత్ర అంటే నాగార్జునకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చేసేందుకు ఇటీవలే మరోసారి ఓకే చెప్పాడు.

ఇంతలోనే ‘నేలటిక్కెట్టు’ ఈ స్థాయి పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు నాగార్జున వెనుకంజ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున చూస్తూ చూస్తే కళ్యాణ్‌ కృష్ణను నమ్మి నట్టేట మునగలేడు. మరో సినిమా చేసి కళ్యాణ్‌ తన సత్తాను చాటుకుంటే అప్పుడు నాగార్జున నుండి ఆఫర్‌ను అడగవచ్చు అంటూ సమాచారం అందుతుంది. ప్రస్తుతం నాగార్జున ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయడంతో పాటు పూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.