ఇంకా ఏడాదే గడువు ! బాబు రెడీగా ఉన్నావా ..?       2018-06-08   01:53:59  IST  Bhanu C

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అన్ని పార్టీలకు ఇది ఎంతో కీలకమైన సమయం. రాబోయే ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలంటే .. ఈ సంవత్సరకాలం లో ప్రజల్లో విశ్వాసం కలిగించగలగాలి. ఇక అధికార పార్టీ తెలుగుదేశం విషయానికి వస్తే… అన్ని పార్టీలకంటే టీడీపీ మరింత కష్టపడాలి. సాధారణంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. వీటన్నిటిని తట్టుకుని ప్రజల్లో విశ్వాసం కల్పించగలగాలి. అప్పడే విజయావకాశాలు ఉంటాయి.

అధికారం చేపట్టి మూడు సంవత్సరాల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతుంది .. ఇక టీడీపీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కొండంత బలాన్ని అందించాయి. ఈ రెండు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేశాయి. తెలుగుదేశం పార్టీకి ఎదురులేదనే వాతావరణాన్ని సృష్టించింది. ఆ తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుని పోరాటయాత్ర చేస్తున్నారు. అంటే నాలుగేళ్లలో టీడీపీ మిత్రులను వదులుకుని ఒంటరిగా మిగిలిపోయింది.

కొంతకాలం క్రితం వరకు కేంద్రంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న టీడీపీ ప్రస్తుతం బీజేపీతో సున్నం పెట్టుకుని బయటకి వచ్చేసింది. కలిసి ఉన్నన్నాళ్ళు బీజేపీ చెప్పిన దానికి తల ఊపుతూ .. హోదా కాదు ప్యాకేజ్ ఇస్తాము అంటే ఒకే అని చెప్పింది. కానీ వారిద్దరి మధ్య బంధం చెడిపోయాక ప్యాకేజ్ కాదు హోదానే కావాలని టీడీపీ మారం చేస్తోంది. ఇది టీడీపీ అవకాశవాద రాజకీయాలకు అర్ధం పడుతోంది.

ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించడం, జనసేన అధినేత కళింగాంధ్రా ఉద్యమం వస్తుందని హెచ్చరించడం, రమణదీక్షితులు వివాదం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని బీజేపీపై విరుచుకుపడేందుకు ఉపయోగించుకుంటున్నారు. జగన్, పవన్ ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక గ్రాఫిక్కుల్లో తప్ప ఇంకా పునాది పడని రాజధాని నిర్మాణం తెలుగుదేశం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అసలు ఈ ఏడాదిలో చంద్రబాబు ఫెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుంది అనేదాని మీదే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.