ఆ విధంగా.. పవన్ సీఎం అవ్వబోతున్నాడట !       2018-05-16   07:44:53  IST  Bhanu C

ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఆ పార్టీ అభిమానుల తీరు. ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ లక్షణాలను అలవర్చుకోకుండా … ఎన్నికలకు సిద్ధం అయిపోతున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది జనసేన అని టక్కున చెప్పేయవచ్చు. ప్రజలకు ఏదో సేవ చేయాలనీ రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న ఆ పార్టీ అధినేత అందుకు తగ్గ వ్యూహాలు వెయ్యడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. వాస్తవం గా చెప్పాలంటే జనసేన ఇంకా వన్ మ్యాన్ షోలాగే ఉంది. ఆ పార్టీలో చెప్పుకోదగిన మరో వ్యక్తి కనిపించడంలేదు కూడా. అయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా మాత్రం తెగ రెచ్చిపోతున్నారు. వారు తెలిసి చేసినా తెలియక చేసినా అది పవన్ కి మాత్రం కీడే చేస్తోంది.

పార్టీ సంస్థాగత నిర్మాణం కాని, కార్యకర్తల శిక్షణ కాని, ఎంపిక కాని ఇంకా జరగలేదు. అభిమానులు ఎక్కువ మంది అత్యుత్సాహంతో పవనిజం అనే ఒక రిలీజియన్ క్రియేట్ చేసి, దాన్ని ఒక మతం గా ప్రచారం చేసి, పవన్ కి దేవుడు స్థాయి కూడా ఇచ్చేసారు. అయితే పవన్ సినిమా అభిమానులు మొత్తం రాజకీయ అభిమానులుగా మారారా అంటే చెప్పలేని పరిస్థితి. పవన్ ఫాన్స్ చేసే కొన్ని కామెంట్స్ పవన్ కి నష్టం చేకూర్చే విధం గా ఉన్నాయి. పవన్ నాకు సిఎం పదవి లక్ష్యం కాదు, ప్రజా సేవ లక్ష్యం అని చెప్తుంటే, పవన్ అభిమానులు మాత్రం సిఎం కావటానికి ప్రణాళికలు సోషల్ మీడియా లో వేసేస్తున్నారు. …

“పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కర్ణాటక ఎలక్షన్ ఒక్కసారి గమనించండి. పవన్ సీఎం అవ్వడం ఏమంత కష్టం కాదు 38 సీట్లు వచ్చిన జెడి(యస్) కుమార స్వామీ ఈరోజు సీఎం అవుతున్నారు. దయచేసి చెప్తున్న చాలామంది పవన్ ని సీఎం గా చూడాలని ఉన్నారు. కానీ సీఎం కావడం కష్టం అని 88 సీట్లు తెచ్చుకోలేడని సీఎం కాలేడని ఇతర పార్టీలో అలాగే ఉండిపోయారు. కర్ణాటకలో చూడండి ఏం జరుగుతుందో దాన్నిపట్టి చూస్తే పవన్ సీఎం సీటుకి ఎంత దగ్గరలో ఉన్నాడో ఎవ్వరూ నిరాశ పడకుండా గెలుపుకి కృషి చెయ్యండి.
జై జనసేన✊
జై హింద్ ✊✊”
అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టేస్తున్నారు. అంతటి తో ఆగకుండా జనసేనకు 20 – 25 సీట్లు వస్తే సరిపోతుంది మన పవన్ అన్న సీఎం అయిపోవచ్చు అంటూ పోస్టింగులతో సోషల్ మీడియా ను హోరెత్తిస్తున్నారు. పాపం జనసేన అధినేత ఏమో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసి మా తడాఖా చుపిస్తాము అంటే ఆయన ఫ్యాన్స్ మాత్రం 20 – 25 సీట్లు అంటూ సరిపెట్టేసుకుని పవనే ముఖ్యమంత్రి అంటూ కలలు కనిస్తున్నారు.