ఆగితే బాగుండేది.. రాంగ్‌ టైమింగ్‌       2018-05-28   00:42:58  IST  Raghu V

ఒక సినిమాను ఎంత బాగా తీసినా కూడా దాన్ని పబ్లిసిటీ చేయడంతో పాటు, ప్రేక్షకుల ముందుకు సరైన సమయంలో తీసుకు రావడం చాలా ముఖ్యం. సినిమా ఎంత భారీగా తీసినా, ఎంత మంచి కథతో తీసినా కూడా రాంగ్‌ టైంలో విడుదల చేస్తే ఆ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథ, కథనం విషయంలో ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారో అలాగే అన్ని జాగ్రత్తలు కూడా విడుదల సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే ప్రేక్షకులకు ఆ చిత్రం చేరుతుంది.

తాజాగా ‘అమ్మమ్మగారిల్లు’ మరియు ‘నేలటిక్కెట్టు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు చిత్రాల్లో ‘నేలటిక్కెట్టు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వగా, ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం ఒక మోస్తరుగా ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉందంటూ విశ్లేషకులు రివ్యూలు ఇచ్చారు. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చినప్పటికి నెగటివ్‌ కలెక్షన్స్‌ నమోదు అవుతున్నాయి. విడుదలైన మొదట మూడు రోజుల్లో కనీసం కలెక్షన్స్‌ను రాబట్టడంలో అమ్మమ్మగారిల్లు విఫలం అయ్యింది. కారణం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మహానటి జోరు కొనసాగుతుంది.

ప్రస్తుతం ప్రేక్షకులు అంతా కూడా మహానటిని ఆధరిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిన్న చిత్రాలు వస్తే ఆధరణ దక్కడం ఖచ్చితంగా అసాధ్యం. ఒక వేళ సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ అయితే తప్ప, అందరి దృష్టిని ఆకర్షించి మహానటిని మించి ఉంటే తప్ప సినిమాకు కలెక్షన్స్‌ రావడం కష్టం. అలాంటిది పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నంత మాత్రాన ప్రేక్షకుల మహానటిని వదిలేసి అమ్మమ్మగారింటికి వెళ్తారా అంటూ ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.
నాగశౌర్య, షామిలీ జంటగా నటించిన ఈ చిత్రంలో ఫ్యామిలీ విలువలు మరియు చక్కని పల్లెటూరు వాతావరణంను చూపించడం జరిగింది. దాంతో సినిమాకు విశ్లేషకులు మంచి మార్కులే ఇచ్చారు. కాని మహానటి చిత్రం మాత్రం అమ్మమ్మగారిల్లు చిత్రాన్ని తొక్కేసింది. మహానటి తొక్కేసిందనే కంటే నాగశౌర్య సినిమా రాంగ్‌ టైమింగ్‌లో వచ్చిందని చెప్పుకోవచ్చు. మరో వారం లేదా రెండు వారాలు ఆగి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కలెక్షన్స్‌ ఇంకోలా వచ్చేవి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.