అన్న‌తో పాటు త‌మ్ముడూ అసెంబ్లీకే పోటీనా... ఆగ‌మాఘ‌మేనా..       2018-05-22   04:02:49  IST  Bhanu C

తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రూటే స‌ప‌రేటు. ఇక న‌ల్ల‌గొండ జిల్లాలోనైతే వారికిక తిరుగేలేదు. ఇద్ద‌రు సోద‌రులు ఏది మాట్లాడినా.. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం స‌`ష్టిస్తుంది. పార్టీ అధిష్ఠానాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపిపించ‌దు. పార్టీలో కీల‌కంగా ఉంటూనే త‌మ సొంత ఎజెండాతోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం వారికే సాధ్యం. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు..? పార్ల‌మెంటు స్థానాల్లో బ‌రిలోకి దిగుతారా..? లేక అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తారా..? అన్న‌దానిపై ఇప్పుడు న‌ల్ల‌గొండ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది.

అయితే పార్ల‌మెంటుకు వెళ్తార‌ని ఒక‌రంటే… లేదులేదు.. అసెంబ్లీకే వెళ్తారంటూ మ‌రొక‌రు.. ఇలా న‌లుగురు క‌లిసిన‌చోట ఇదే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న ప్ర‌జాచైత‌న్య‌బ‌స్సుయాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. అయితే ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించే స‌భా వేదిక‌ల‌పై ప‌లుచోట్ల‌ అభ్య‌ర్థుల‌ను టీపీసీ చీఫ్ ప్ర‌క‌టించ‌డంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండానే.. ఈసారి మునుగోడు నియోజకవర్గ ప్రజల కోరిక‌ మేరకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల మునుగోడు మండలంలోని ఓ గ్రామంలో జ‌రిగిన ముఖ్య‌కార్త‌క‌ల స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం గుండాల మండ‌లంలో ప‌ర్య‌టించిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి డీసీసీ అధ్య‌క్షుడు మాజీ ఎమ్మెల్యే భిక్ష‌మ‌య్య‌గౌడ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్‌ కార్యకర్తలకు పార్టీతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ అండగా ఉంటారని వెంక‌ట్‌రెడ్డి అన్నారు. పార్టీ బలోపేత కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఏక్క‌డిన నుంచి పోటీచేస్తార‌న్న‌దానిపై మాత్రం అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. న‌ల్ల‌గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తార‌ని కొంద‌రు నాయ‌కులు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం పార్ల‌మెంటుకే వెళ్తార‌ని అంటున్నారు. అయితే ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేసినా టీఆర్ఎస్ ను ఓడించ‌డ‌మే ధ్యేయంగా ముందుకు వెళ్తార‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. మ‌రోవైపు న‌ల్ల‌గొండ జిల్లాలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది.