అతడు, అజ్ఞాతవాసి ఒక్కటే అంటున్నాడు       2018-05-28   00:29:24  IST  Raghu V

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ దర్శకుడు. ఈయన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘అరవింద సమ్మేత’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకునేలా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై త్రివిక్రమ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం గురించి మరియు ఇంకా పలు విషయాల గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. తాను సినిమాల్లో రాసిన ఏ ఒక్క డైలాగ్‌ను కూడా నేను క్రియేట్‌ చేసి రాసింది కాదని, ఆ పదాలు గతంలో ఎంతో మందితో వాడబడ్డవే అని, ఎవరైనా సొంతంగా డైలాగ్‌ రాశాము అని చెప్పినా కూడా అబద్దం అవుతుందని త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. తనకు పవన్‌పై ఉన్న అభిమానంను, ఇద్దరి మద్య ఉన్న స్నేహంను వివరించిన త్రివిక్రమ్‌, పవన్‌తో తాను చేసిన అజ్ఞాతవాసి చిత్రం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి రోజు పేపర్‌లో వచ్చే బిజినెస్‌ పేజీని కొందరు మాత్రమే చూస్తారు. అలాంటి బిజినెస్‌ పేజీలాంటి సినిమా ‘అజ్ఞాతవాసి’. అంతా చూస్తారనే భ్రమతో ఆ చిత్రాన్ని చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

తన ఆల్‌టైం ఫేవరేట్‌ చిత్రాల్లో అతడు ముందు ఉంటుందని చెప్పుకొచ్చిన త్రివిక్రమ్‌, అజ్ఞాతవాసి కూడా అతడులా మంచి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. వెండి తెరపై కాసుల వర్షం కురిపించడంలో అతడు ఫెయిల్‌ అయ్యింది. కాని బుల్లి తెరపై కొన్ని వందల సార్లు ఈ చిత్రం ప్రసారం అయ్యి హిట్‌గా నిలిచింది. అతడు విడుదల సమయంలో ప్రేక్షకుల పరిణితి పెరగలేదు. ఆ తర్వాత అతడును అర్థం చేసుకున్నారు. అలాగే అజ్ఞాతవాసి చిత్రం విషయంలో కూడా జరుగుతుందనే నమ్మకంను త్రివిక్రమ్‌ వ్యక్తం చేస్తున్నాడు.

అజ్ఞాతవాసి చిత్రం బుల్లి తెరపై భవిష్యత్తులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో త్రివిక్రమ్‌ ఉన్నాడు. అతడుకు అజ్ఞాతవాసికి టైటిల్‌లో ఒక ‘అ’ అక్షరం తప్ప మిగిలిన ఏ విషయాలు కలవవు. అతడు రేంజ్‌లో బుల్లి తెరపై అజ్ఞాతవాసి అలరించడం అనేది అసాధ్యం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై ఉన్న నమ్మకం అపనమ్మకం అవుతుందని సినీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. అజ్ఞాతవాసితో నిరుత్సాహ పర్చిన త్రివిక్రమ్‌ ఇప్పుడు అరవింద సమేత చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడేమో చూడాలి.