అంతే అంతే, అలాగే చెప్పాలి       2018-05-27   23:34:05  IST  Raghu V

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఆ ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందులో ఉన్నవారు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో కూడా తెలియదు. ప్రతి సినిమాకు పరిస్థితిలు మారిపోతూ ఉంటాయి. తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు ‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో వచ్చిన రాజ్‌ తరుణ్‌ రెండు మూడు సంవత్సరాలు వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో జూనియర్‌ మాస్‌ మహారాజా అనిపించుకున్నాడు. అయితే ఈయన గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఏ ఒక్క సినిమా సక్సెస్‌ కావడం లేదు. దాంతో ఈయన క్రేజ్‌ మెల్లగా తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఈ సంవత్సరంలో ‘రంగుల రాట్నం’ చిత్రంతో రాజ్‌ తరుణ్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాగా అది నిలిచింది. ఇక ప్రస్తుతం ‘రాజుగాడు’ అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. రాజుగాడు చిత్రం తర్వాత ఈయనకు పెద్దగా ఆఫర్లు రావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. చిన్నా చితకా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా కూడా రాజ్‌ తరుణ్‌ నో చెబుతున్నాడు. పెద్ద దర్శకులతో అయితేనే చేస్తానంటూ పట్టుబట్టుకు కూర్చున్నాడు. అయితే నిర్మాతలు ఈయనతో సినిమాలు తీసేందుకు జంకుతున్న సమయంలో పెద్ద దర్శకులు అంటూ పట్టుబట్టడం ఏమాత్రం సమంజస నిర్ణయం కాదంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ‘రాజుగాడు’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తాను సినిమాల సంఖ్య కాస్త తగ్గించాను. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేయడం లేదు, ఆచి తూచి అడుగులు వేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలతో సక్సెస్‌ను దక్కించుకుంటాను అనే నమ్మకం ఉందని, కథ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు సక్సెస్‌ అవుతాయని తన అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు.

అవకాశాలు వస్తున్నా కూడా తాను నో చెబుతున్నాను అంటూ రాజ్‌ తరుణ్‌ చెబుతున్న విషయాన్ని కొందరు కొట్టి పారేస్తున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం ఇండస్ట్రీలో ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండాలి. లేదంటే రాజ్‌ తరుణ్‌ను పూర్తిగా పక్కకు పెట్టేస్తారని అంటున్నారు. సినిమా ఆఫర్లు లేకున్నా కూడా ఉన్నట్లుగా చెప్పాలి, నిర్మాతలు రాకపోయినా కూడా తన వద్దకు క్యూ కట్టి మరీ వస్తున్నారని చెప్పినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలరు. ఒక హీరోను పక్కకు పెట్టారు అంటూ ప్రచారం జరిగితే ఆ హీరో వద్దకు ఏ నిర్మాత మరియు దర్శకుడు వెళ్లడు. దాంతో హీరో ఎప్పుడు లైమ్‌ లైన్‌లోనే ఉండాలి. ఇప్పుడు రాజ్‌ తరుణ్‌ తెలివిగా అదే చేస్తున్నాడు. మళ్లీ ఆయనకు మునుపటి క్రేజ్‌ దక్కుతుందో చూడాలి.

,