ఏపీ రాజకీయాల్లోకి మరోసారి జగన్ బాణం దూసుకొచ్చింది.పదునైన మాటలతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే ఈ బాణం చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
అయితే తన అన్న జగన్ ఒంటరి పోరాటం చేస్తుండడం తో చేయూతనందించేందుకు మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఈ జగన్ వదిలిన బాణం పేరు షర్మిల.వైఎస్ రాజశేఖర రెడ్డి వలే అనర్గళంగా మాట్లాడుతూ ఉండే షర్మిల ఇప్పుడు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలోకి దిగి టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది.
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించారు.వర్ధంతికి జయంతికి తేడా తెలియని, అ ఆ లు కూడా రాని లోకేష్ కు మూడు మంత్రివర్గ శాఖలు ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించారు.
సోమవారం ఆమె అమరావతిలో మీడియాతో ఆమె మాట్లాడారు.
తొమ్మిదేళ్లలో హైదరాబాద్ కట్టానని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా ఎందుకు నిర్మించలేదు అంటూ ప్రశ్నించారు.
అనుభవం ఉందని చెప్పుకునే బాబుకి కేవలం మోసం, వెన్నుపోటు, అవినీతి, స్వార్థ రాజకీయాలు, గోబెల్స్ ప్రచారం, ఆడవారి వ్యక్తిత్వాన్ని కించపర్చడం, హత్యలు చేయించడం, హత్యలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వడంలో మాత్రమే అనుభవం ఉందని మండిపడ్డారు.చంద్రబాబును మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకరు ఉండరని స్వయంగా ఆయనకు పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారే అన్నారని ఆమె చెప్పుకొచ్చారు.
2014లో మొదటి సంతకం చేసిన వాటిని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు పసుసు కుంకుమ పేరుతో మరో కొత్త మోసానికి పాలపడుతున్నారన్నారు.40 ఏళ్లల్లో రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో ఐదేళ్లలో చంద్రబాబు అంత అప్పుచేశారన్నారు.మోడీతో బాబు జోడీ కట్టి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను రాకుండా చేశారన్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక యాక్టర్ అని, డైరెక్టర్ చెప్పినట్లు చేయడం ఒక యాక్టర్ పని అన్నారు.పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమాకు చంద్రబాబు డైరెక్టర్ అని, కాబట్టి చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తున్నారని అన్నారు.
కోట్లాది మంది ప్రజల డేటా చోరీ చేస్తే పవన్ మాట్లాడలేదని గుర్తు చేశారు.బయటకు విడిగా పోటీ చేస్తున్న అంతర్గతంగా కలిసే ఉన్నారని ఇదంతా వైసీపీ ని దెబ్బతీయడానికే అని ఆమె మండిపడ్డారు.
.