పేద పిల్లల కోసం సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన ట్రాఫిక్ పోలీస్ ..ఆ ట్రాఫిక్ పోలీస్ గురించి అందరూ తెలుసుకోవాల్సిందే...

పోలీస్ లు అంటే రాజకీయనాయకులకి , పై ఆఫీసర్ లకి సలాం కొట్టే వారు అని చాలా మంది జనాలు అనుకుంటారు.వారు వారి జీతాల కోసం , ప్రమోషన్ల కోసం మాత్రమే వారి విధిని నిర్వర్తిస్తారు అనుకుంటారు , కానీ అందరూ పోలీస్ లు ఒకేలాగా ఉండరు , నిజం చెప్పాలంటే మనం అనుకున్న దానిలో ఒక శాతం పోలీస్ లు మాత్రమే అలా ఉంటారు , మిగితా వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తారు.

 Kolkata Traffic Police Arup Mukherjee Constable Had Established School-TeluguStop.com

వీరందరికి భిన్నంగా ఒక ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఒక వర్గానికి చెందిన నిరుపేద పిల్లల కోసం తన సొంత డబ్బులతో ఒక పాఠశాలనే నిర్మించి ఉచితంగా చదువు చెప్పిస్తూ తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు.అతనే కోల్ కతా కి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుప్ ముఖర్జీ.

అసలు కథ ఏంటి ?

కోల్ కతా లో నివసించే ప్రజలలో సబర్ తెగ ఒకటి , అప్పట్లో ఈ తెగ వారు ఎక్కువగా నేరాలు చేసేవారు.అందుకని బ్రిటిష్ వారి కాలంలో పలు తెగలకు చెందిన వారిని నేరస్థులుగా, ఆ తెగలను క్రిమినల్ ట్రైబ్స్‌గా ముద్ర వేశారు.

తరువాత కూడా వారిపై పడ్డ ముద్ర అలాగే ఉంది.అలాంటి తెగల్లో సబర్ తెగ కూడా ఒకటి.ఈ వర్గానికి చెందిన వారిలో ఎక్కువ మంది నిరుపేదలే , వారి పిల్లలకు చదువు ఉండదు.క్రిమినల్ ట్రైబ్స్‌గా ముద్ర పడినందున వీరికి ఎవరూ పని ఇవ్వరు.

దీంతో వీరి బతుకులు ఎప్పుడు చూసినా దుర్భరంగానే ఉంటాయి.ఇలాంటి వారి జీవితాలను మార్చాలని ఆలోచించాడు ఆ పోలీస్ కానిస్టేబుల్.

అందుకనే ఈ తెగకు చెందిన పిల్లలకు తన సొంత ఖర్చులతో స్కూల్‌ను నిర్మించి అతను ఉచితంగా విద్యను అందిస్తున్నాడు.అతనే కానిస్టేబుల్ అరుప్ ముఖర్జీ.

పాఠశాల వెనుక ఉన్న ఆలోచన

కోల్ కతా కి చెందిన అరుప్ ముఖర్జీ , సౌత్ ట్రాఫిక్ పోలీస్ గార్డ్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.అతను ట్రాఫిక్ పోలీస్ గా పని చేస్తూనే అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తూ తనకు తోచినంత సహాయం చేస్తూ ఉండేవాడు.అప్పుడే సబర్ తెగకు చెందిన పిల్లల గురించి ఇతను తెలుసుకున్నాడు.వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు.అందులో భాగంగానే 1999లో తాను కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రతి నెలా తన జీతంలో కొంత డబ్బును పొదుపు చేసేవాడు.అలా అతను పొదుపు చేసిన సొమ్ముతో 2011లో పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ” ది పంచా నబదిశా మోడల్ ” స్కూల్‌ను ఏర్పాటు చేశాడు.

అందులో ఆరంభంలో 20 మంది సబర్ తెగకు చెందిన పిల్లలకు అతను చదువు చెప్పడం ఆరంభించాడు.ఇప్పుడు ఆ పాఠశాలలో 150 మంది సబర్ తెగ పిల్లలు చదువుకుంటున్నారు.

అరుప్ ముఖర్జీ పెట్టిన ఆ స్కూల్‌లో 3 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు చదువు చెబుతారు.వారు 4వ తరగతికి చేరుకోగానే స్కూలే వారిని తమకు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి కావల్సిన సదుపాయాలను సమకూరుస్తుంది.అలాగే ఆ స్కూల్‌లో పిల్లలకు కావల్సిన ఆహారం, వసతి, యూనిఫాం, బుక్స్ తదితర సామగ్రిని అందిస్తారు.ఇందుకు గాను మొదట్లో ముఖర్జీ జీతం సరిపోకపోయేది.కానీ ఆ పాఠశాల గురించి తెలిసిన వారు , ఎన్ఆర్ఐ లు , ముఖర్జీ డిపార్ట్మెంట్ వారు సహాయం చేయడంతో ఆ పాఠశాలని మరింత చక్కగా తీర్చిదిద్దారు.

అరుప్ మంచి మనస్సుకు దక్కిన బహుమానలు

అరుప్ ముఖర్జీ అలా తన సొంత ఖర్చులతో స్కూల్ పెట్టి పిల్లలకు విద్యను అందిస్తున్నందుకు గాను ఆయనకు పలు అవార్డులు, సత్కారాలు కూడా దక్కాయి.ది టెలిగ్రాఫ్ స్కూల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2018 అవార్డుల కార్యక్రమంలో ముఖర్జీకి ప్రత్యేక గౌరవం కూడా దక్కింది.నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేయడం తరువాత స్కూల్‌కు వెళ్లడం పిల్లలకు చదువు చెప్పడం చేస్తాడు.

అతను చేసిన కృషి వల్ల సబర్ తెగకు చెందిన ఎంతో మంది పిల్లల జీవితాల్లో చదువుకోవలన్న తపన పెరుగుతుంది.పోలీస్ అంటే ప్రజలతో ఉండేవాడు ప్రజల కోసం ఉండేవాడు అని సాటి పోలీస్ లకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు అరుప్ ముఖర్జీ…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube