టికెట్ల ప్రకటనతో వైసీపీలో పెరిగిన ఇక్కట్లు

మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరికంటే ముందుగానే అన్ని స్థానాల్లో పోటీ చేసి అభ్యర్థులకు సంబంధించి టికెట్ల ప్రకటన పూర్తి చేసింది.ఇప్పుడు అదే ఆ పార్టీలో కొత్త తలనొప్పులు తెస్తోంది.

 Ys Jagan Tension Over Selecting Candidates In Ycp-TeluguStop.com

మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పూర్తికాగానే ఎక్కడికక్కడ నిరసన జ్వాలలు పెరిగిపోయాయి.ఇప్పటివరకు ఉన్న నియోజకవర్గ సమన్వయకర్తలను కాదని రాత్రికి రాత్రి పార్టీ మారిన వారికి టికెట్లు కేటాయించడంపై మండిపడుతున్నారు.

ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకున్న వారిని జగన్‌ నట్టేట ముంచారని శాపనార్ధాలు పెడుతున్నారు.టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల ముందు ధర్నాలకు దిగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

విశాఖ తూర్పులో సీనియర్‌ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ను పక్కనపెట్టి విజయ నిర్మలకు టికెట్‌ ఇవ్వడంతో అక్కడ అసంతృప్తి చెలరేగింది.ఎంవీపీ కాలనీలోని ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయానికి చేరుకుని జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ ఇళ్ల వద్ద కూడా ఆందోళన నిర్వహించారు.అలాగే యలమంచిలి టికెట్‌ కన్నబాబురాజుకు ఇవ్వడంతో మాజీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతే కాదు విజయసాయిరెడ్డి డబ్బులు తీసుకుని కన్నబాబురాజుకు టిక్కెట్‌ ఇచ్చారని ప్రగడ నాగేశ్వరరావు ఆరోపించారు.వైసీపీ లో చేరీ చేరగానే విశాఖ దక్షిణ సీటును ద్రోణంరాజు శ్రీనివా్‌సకు కేటాయించడంపై ఆ నియోజకవర్గ వైసీపీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోయింది.

ప్రస్తుత సమన్వయకర్త డాక్టర్‌ రమణమూర్తి, మాజీ ఇన్‌చార్జి కోలా గురువులు వేరు వేరుగా తమ అనుచరులతో సమావేశమయ్యారు.పార్టీలో కొనసాగాలా మారాలా అన్న విషయంపై చర్చించుకుంటున్నారు.

అలాగే పాడేరు టికెట్‌ను మాజీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి కేటాయించడంతో ప్రస్తుత సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు గుర్రుగా ఉన్నారు.ఆయన కూడా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నారు.అనకాపల్లి అసెంబ్లీ సీటు ఆశించిన దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు కూడా చేదు అనుభవమే ఎదురయ్యింది.మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకూ చాన్సు దక్కలేదు.తూర్పుగోదావరిలో కాకినాడ పార్లమెంటు సీటు అశోక్‌, అనిల్‌లో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందని అంతా భావించగా శనివారం పార్టీ కండువా వేసుకున్న వంగా గీతను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా షాక్ తిన్నారు.పెద్దాపురం టికెట్‌ను రెండు రోజుల కిందట పార్టీలో చేరిన తోట నరసింహం భార్య వాణికి కేటాయించడంతో ఆ స్థానాన్ని ఆశించిన దొరబాబు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో వైసీపీ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ని కాదని డాక్టర్ బాబ్జి కి టికెట్ కేటాయించడంతో నిరసన చెలారిగింది.నాగబాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.

ఇలా ప్రతి జిల్లాలోనూ వైసీపీలో ఇదే తంతు మొదలవ్వడంతో ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన వైసీపీలో మొదలయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube