స్కూల్ ఫీజు అని అబద్దం చెప్పి...తండ్రి డబ్బులతో సినిమాకెళ్ళాడు.! తర్వాత ఏమైందో తెలుస్తే కన్నీళ్లే.!

“నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు” ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు.అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని ‘అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడు.రెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు

 Father And Son Love Emotional Story1-TeluguStop.com

“అవునా! రెండు వందలా ఈసారి బాగా పెంచేశారు , సర్లే రేపు బడికి వెళ్ళినపుడు ఇస్తాను” అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు.మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా ‘ఇదిగోరా రెండువందలు, జాగ్రత్త మరి , వెళ్లినవెంటనే టీచర్ కి ఇవ్వు’ అని జేబులో పెట్టాడు.

సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు.రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు.ఏరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ? ఆతృతగా అడిగాడు అమర్

ఇచ్చారురా మరి , మీ నాన్న ? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు
నేను ఫీజు రెండువందల యాభై రూపాయలు అని చెప్తే మారు మాటాడకుండా ఇచ్చేసారరా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్
ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు వంద రూపాయలే.తమ తల్లిదండ్రులనుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్లాలని పథకం వేసుకున్నారు.ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచీలో కూర్చుంటారు, కలిసి తిరుగుతుంటారు.తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు.చెరో వంద వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు

మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరూ ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌనుకు బయలుదేరారు.సినిమా చూసి, ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కుని తిన్నారు.

ఆనందంగా గడిపారు, చీకటిపడే వేళకు ఇంటికి చేరుకున్నారు.రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్టు నమ్మించేందుకు ఒక క్రికెట్ బాట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.

అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగిపోయాడు

కిటికీలోంచి లోపలకు చూసాడు, వాళ్ల నాన్న మంచం మీద జ్వరంతో వనికిపోతూ ఉన్నాడు.అతని భార్య సపర్యలు చేస్తూ ” వచ్చిన డబ్బులన్ని పిల్లాడు ఫీజు కోసం ఇచ్చేశావ్, మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు” అంది
అందుకు కేశవులు సమయానికి ఫీజు కట్టకపోతే రఘుని పరీక్షలకు అనుమతించరు.నాకు మాములు జ్వరమెగా వచ్చింది రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ

అలా అంటే ఎలా నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఒక యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను, అంటూ లేవబోయిన ప్రమీల చేయి పట్టుకుని ఆపి వద్దు రేపు చూద్దాంలే ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు కేశవులు
అదంతా చూస్తున్న రఘుకు బాధగా అనిపించింది.తన విలాసాల కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు ఎంత విలువైనవో తెలిసి వచ్చింది.అది కాక రోజు వారి కూలికి వెళ్లి సంపాదించే తన తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయానని బాధ పడ్డాడు.తన ఫీజుకోసం ఉన్న డబ్బులన్ని ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది

గదిలోకి పరుగున వెళ్లి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు.

వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు.తప్పును క్షమించమని విలపించాడు.వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు కోపగించుకోలేదు

పైగా “చూడు రఘు! నువ్వే మా సర్వస్వం.నీకోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం.

నువ్వు మాలా కూలి బ్రతుకు బ్రతకకూడదన్నదే మా కోరిక.జరిగింది మరిచిపో , ఇక మీద నీకేం కావాలన్న సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు మేము తెచ్చిపెడతాం.

మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు, అంటూ అక్కున చేర్చుకున్నారు
ఆ ఘటన రఘులో గొప్ప మార్పు తెచ్చింది.ఎప్పుడూ మంచి ప్రవర్తనతో మెలుగుతూ , తన మిత్రుడిలోనూ అలాంటి పరివర్తన తీసుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube