రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం

 Rarandoi Veduka Chuddam Review-TeluguStop.com

బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

నిర్మాత : నాగార్జున అక్కినేని

సంగీతం : దేవిశ్రీప్రసాద్

విడుదల తేది : మే 26, 2017

నటీనటులు – నాగచైతన్య, రకుల్ ప్రీత్, జగపతిబాబు, సంపత్ రాజ్ తదితరులు

నాగచైతన్య పెద్ద బ్లాక్ బస్టర్ కోసం కొన్నేళ్ళుగా కాదు, తన కెరీర్ ప్రారంభం నుంచి ఎదురుచూస్తున్నాడు.ఈమధ్య ప్రేమమ్ సక్సెస్ చైతుని కొద్దిగా ఓదార్చినా, ఆ వెంటనే వచ్చిన సాహసం శ్వాసగా సాగిగో పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.

అందుకే సొగ్గాడే చిన్నినాయన లాంటి బ్లాక్ బస్టర్ తో బోణి కొట్టిన కళ్యాణ్ కృష్ణతో చేతులు కలిపి “రారండోయ్ వేడుక చూద్దాం” అంటూ ప్రేక్షకులను ఆహ్వానిస్తున్నాడు.మరి ఈ వేడుక అంచనాలను అందుకుందో లేదో చూడండి

కథలోకి వెళితే :

శివ (నాగచైతన్య), భ్రమరాంబ (రకుల్ ప్రీత్) ఓ పెళ్ళిలో కలుసుకుంటారు.తనకో రాజకుమారుడు లాంటి భర్త కావాలని, కొన్ని గుణాల్ని దృష్టిలో పెట్టుకుంటుంది భ్రమరాంభ.ఆ క్వాలిటిస్ శివలో లేకపోవడం వలనేమో, వీరి లవ్ స్టోరి ట్రాక్ ఎక్కేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంది.

కలహాలు, మనస్పర్థలు అప్పటికే ఉన్న వీరి ప్రేమకి, ఇద్దరి తండ్రుల మధ్య ఉన్న పగ అడ్డుపడుతుంది.ఇన్ని అడ్డంకులు, ఇబ్బందులు దాటుకోని ఇద్దరి లవ్ స్టోర్ సక్సెస్ అయ్యిందా లేదా తెరమీద చూడండి

నటీనటులు నటన :

చైతు గురించి మరీ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి లేదు.కొన్నిరోజులు నాగచైతన్య ఈ లవర్ బాయ్ టైప్ పాత్రలు వదిలేసి ఇంకేదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుందేమో .ఈ సినిమాలో కూడా షరామామూలుగానే అనిపించాడు చైతు.పెర్ఫార్మెన్స్ డోఖా లేకున్నా, పులిహోర బాగుంటుందని ఎప్పుడు అదే తినలేం కదా.బీచ్ సీన్ మాత్రం అదరగొట్టేసాడు నాగచైతన్య
రకుల్ ఈ సినిమాలో తన క్యారక్టర్ కి చాలా హైప్ ఇచ్చింది.కాని హైప్ కి తగ్గ కొత్తదనం లేదు.రకుల్ లో చాలాచోట్ల ఓవర్ యాక్టింగ్ టోన్ కనిపించింది.సొంత డబ్బింగ్ ఉంటే ఆ టోన్ ఎంతోకొంత తగ్గేది.కాని తెలుగు వచ్చిన హీరోయిన్లు కూడా పరాయి గొంతుల నెట్టుకురావడం ఏంటో! పచ్చిగా చెప్పాలంటే ఆరెంజ్ లో జెనీలియా గుర్తుకువస్తుంది

మిగితా పాత్రల్లో జగపతిబాబు పాత్ర బాగుంది.

సంపత్ టిపికల్.వెన్నెల కిషోర్ ఫర్వాలేదు.

టెక్నికల్ టీమ్ :

విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రాఫి ఫర్వాలేదు.కాని ఓ కన్సిస్టెన్సి అంటూ ఉండదు.

అన్నపూర్ణ స్టూడియోస్ వారి నిర్మాణం కాబట్టి ఇంకాస్త రిచ్ నెస్ ఉండాల్సింది.ఎడిటింగ్ చాలా పూర్.

మొదటి గంటలో ఎంత కావాలంటే అంత కట్ చేయొచ్చు అని చూసినవాళ్ళంతా అనుకున్నా అనుకుంటారు.సెకండాఫ్ పేస్ బెటర్.

దేవిశ్రీప్రసాద్ బాణిలు బాగున్నాయి.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి ఎలాగో బాగా ఇస్తాడు.

కాని తన మార్క్ చార్ట్ బస్టర్ ఒకటి ఈ సినిమాలో లేకపోవడం చిన్న డిజపాయింట్ మెంట్.అన్నపూర్ణ వారి నిర్మాణ విలువలు కొలతల్లో ఉన్నాయి.లెక్కల్లో ఖచ్చితత్వం పాటించినట్టున్నారు.

విశ్లేషణ :

హీరోహీరోయన్లు ఓ పెళ్ళిలో కలవడం, వారి మధ్య స్నేహం, కలహాలు, చివరకి ప్రేమ, కాని అప్పటికే వారి కుటుంబాల మధ్య ఏవో పగలు ఉండటం, వాటిని చివరికి హీరో ఎలా అంతం చేసాడు, హీరోహీరోయిన్లు ఎలా ఒక్కటయ్యారు .ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం ఈ కథ? ఈ పాతచింతకాయ పచ్చడి రుచి మనకు మరోసారి కొత్త నటులతో చూపించే ప్రయత్నం చేసారు.పెళ్ళి వాతవారణం, ఫ్రేమ్ నిండా క్యారక్టర్లు .కథలేకుండా ఏదో అలా సాగిపోతుంది ఫస్టాఫ్.ఇంటర్వల్ తో చిన్నగా ప్రేక్షకులని అలర్ట్ చేసి, సెకండాఫ్ ఏదో ఫర్వాలేదు అనే కంటెంట్ తో నెట్టుకొచ్చారు.

నిన్నే పెళ్ళాడతా, మురారి రేంజ్ లో ఊహించుకున్నారు.ఆ తాలుకు టేకింగ్ అక్కడక్కడ కనబడ్డా, వాటికి మైళ్ళ దూరంలో ఆగిపోయే సినిమా ఇది.ఈ కాలంలో ఇంత రొటీన్ కథావస్తువుని ఎందుకు ఎంచుకున్నారో నాగచైతన్యకి, దర్శకుడు కళ్యాణ్ కృష్ణకే తెలియాలి.మొత్తం మీద చెప్పాలంటే … ఫ్యామిలి సినిమాల్లో ఇది మురారి లాంటి క్లాసిక్ కాదు, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ కాదు.

ప్లస్ పాయింట్స్ :

* బీచ్ సీన్

* సంగీతం

* టేకింగ్

మైనస్ పాయింట్స్ :

* పసలేని మొదటి గంట

* రకుల్ ప్రీత్

* రోటీన్ స్టోరీ లైన్

* కనెక్ట్ అవని ఎమొషన్స్

చివరగా :

వేడుక కాదు, చిన్నిపాటి వేదన

తెలుగుస్టాప్ రేటింగ్ :2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube