పెళ్లి చూపులు రివ్యూ

చిత్రం : పెళ్లి చూపులు

 Pelli Choopulu Movie Review-TeluguStop.com

బ్యానర్ : బిగ్ బెన్, ధర్మప్రద క్రియేషన్స్

దర్శకత్వం : తరుణ్ భాస్కర్

నిర్మాతలు : రాజ్ కందుకూరి, యష్

సంగీతం : వివేక్ దేవసాగర్

విడుదల తేది : జులై 29, 2016

నటీనటులు : విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, అనీష్ తదితరులు

కొత్తరకమైన ప్రమోషన్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది “పెళ్ళి చూపులు” అనే సినిమా.అగ్ర నిర్మాత సురేష్ బాబు అండదండలతో తెరకెక్కిన ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ ప్రీమియర్ షో నిన్న హైదరాబాదులో ప్రదర్శితం చేయడం జరిగింది.జులై 29న విడుదల కాబోతున్న ఈ సినిమా అద్యంతం ఎలా సాగిందో తెలుసుకోండి.

కథలోకి వెళ్తే …

చిత్ర (రీతూ వర్మ) బాగా స్వతంత్ర భావలున్న అమ్మాయి.తనకంటూ ఓ ఉనికిని సంపాదించుకోవాలని కోరుకుంటుంది.

కాని ఇష్టం లేని పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాడు తండ్రి.ఆ పెళ్ళి చూపులకి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం గల కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) వస్తాడు.

అనుకోని పరిస్థితులలో చిత్ర, ప్రశాంత్ ఒకరి జీవితం గురించి మరొకరు వివరంగా చెప్పుకోవాల్సి వస్తుంది.ఈ పెళ్ళిచూపులు పెళ్ళికి దారి తీయకుండానే ముగిసిపోతాయి.

ఫుడ్ ట్రాక్ బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటుంది చిత్ర.ఆ బిజినెస్ లో ప్రశాంత్ ని భాగస్వామి చేసుకోవాలని అనుకున్నా, మొదట ఒప్పుకొని ప్రశాంత్ తప్పనిసరి పరిస్థితులలో చిత్రతో కలిసి బిజినెస్ చేయాల్సివస్తుంది.

అక్కడినుంచి వీరి ప్రయాణం కొత్త మలుపులు తీసుకుంటుంది.చివరికి వీరి ప్రయాణం ఏ దశకు చేరిందనేదే మిగితా కథ.

నటీనటుల నటన గురించి

రీతూ వర్మ ఇప్పటివరకు టాలెంట్ కి తగ్గ పాత్రలు చేయలేదేమో అని అనుకోవాల్సిందే పెళ్ళిచూపులు చూసిన తరువాత.నాటకీయత కనిపించని హావభావాలు, కాస్త సబ్టిల్ గా, సన్నివేశానికి ఇది చాలు అన్నట్టుగా సాగింది రీతూ నటన.మంచి పాత్రలు, పెద్ద సినిమాలే వస్తే, తనకి మంచి భవిష్యత్తు ఉంది అనడానికి సందేహించాల్సిన పనిలేదు.విజయ్ దేవరకొండ కూడా మెప్పించాడు.

సినిమాకి ప్రధానబలం ఇందులో ఉన్న సహజత్వం.విజయ్ నటనలో కూడా ఇది స్పష్టంగా కనిపించింది.

తన పాత్ర తీరుతెన్నులను మన ప్రత్యేక్షంగా చూస్తున్నాం అన్నంతలా పాత్రలో ఒదిగిపోయాడు.

మిగితా పాత్రధారులు కూడా బాగా నటించారు.

చాలాకాలం తరువాత ఓ సినిమాలో కాస్టింగ్ చాలా బాగా కుదిరింది.నందూ, అనీష్ కురివెల్ల ఈ కాస్టింగ్ కి అదనపు ఆకర్షణ.

సాంకేతికవర్గం పనితీరు

టెక్నికల్ డిపార్టుమెంటు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.సినిమాటోగ్రాఫి ఈ సినిమాకి పెద్ద బలంగా నిలుస్తుంది.

మనం తరుచుగా చూసే సినిమాలకి భిన్నంగా, సహజత్వానికి దగ్గరగా ఉంటూనే, ఓ పెద్ద సినిమా స్థాయిలో ఉంటుంది సినిమాటోగ్రాఫి.ఎడింటింగ్ డిపార్టుమెంటు పనితనం కూడా మెచ్చుకోదగ్గది.

చిన్న చిన్న కంప్లయింట్స్ ఉన్నా, సినిమా జానర్ కి అవి తప్పవు.సంగీతం ఫర్వాలేదు.

ఎక్కడా విసుగు పుట్టించదు.నేపథ్య సంగీతం కూడా బాగుంది.

ఇక రచయితగా, దర్శకుడిగా తరుణ్ భాస్కర్ ప్రతిభకి నిదర్శనంగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు.తెలుగు సినిమాల్లో దాదాపుగా మనం ఎవరి దగ్గర చూడని టేకింగ్ తనది.

తరుణ్ తదుపరి సినిమా మీదే ఇప్పుడే అంచనాలు పెంచేసారు.ఎక్కడా పెద్దగా కంప్లయింట్ చేయలేకుండా ఉంది టేకింగ్.

రచనలో మనం రోజూ చూసే విషయాలు, స్వభావాలు, సంభాషణలే కనబడతాయి.

విశ్లేషణ

నాటకీయత, లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి “పెళ్ళి చూపులు” ఓ పెద్ద ఊరట.మన స్నేహితుల్లో ఒక అమ్మాయి పడే ఇబ్బందులు, తనకున్న వ్యక్తిత్వం.మన స్నేహితుల్లోనే అల్లరిగా తిరిగే ఓ కుర్రాడు, సొంతంగా నిలబడాలి అనే విషయాన్ని పక్కనపట్టేసిన వాడు.

రెండు భిన్న మనస్తత్వాల మధ్య ఓ చిన్ని కథ.ఎంత సహజంగా ఉంది.దానికి సపరేట్ ట్రాక్ వాడుకోకుండా జోడించిన వినోదం.”జోడించడం” అనే పదం వాడటం తప్పు.వినోదభరితంగా సాగిన కథ అని చెప్పడం కరెక్ట్.

మళ్ళీ ఇలాంటి సినిమా చూడటానికి ఇప్పట్లో వీలవుతుందో లేదో.ఇంత సహజమైన సంభాషణలు, పాత్రలు అంత తొందరగా తెలుగు తెరపై చూడటం కష్టమేనేమో.అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా లేదా తెలియదు కాని, యూత్ ప్రేక్షకులకి, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

సెకండాఫ్ కాస్త నెమ్మదించినా, అదేమి పెద్ద అడ్డంకి కాదు.

హైలైట్స్ :

* పాత్రలు, నటీనటుల నటన

* సంభాషణలు

* హ్యూమర్

* కొత్త ఫ్లేవర్

* దర్శకత్వం, సాంకేతిక వర్గం పనితీరు

* ప్రొడక్షన్ వాల్యూస్

డ్రాబ్యాక్స్

* మాస్ ప్రేక్షకుల విందు భోజనం కాదు

* కాస్త నెమ్మదించిన సెకండాఫ్

చివరగా :

ఈ “పెళ్ళి చూపులు” చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.తప్పక చూడండి.

తెలుగుస్టాప్ రేటింగ్ :3.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube